iDreamPost
android-app
ios-app

క‌రోనాకు భ‌య‌ప‌డ‌ర‌ట‌.. ఎన్నిక‌లు ఆపేది లేద‌ట‌..!

క‌రోనాకు భ‌య‌ప‌డ‌ర‌ట‌.. ఎన్నిక‌లు ఆపేది లేద‌ట‌..!

ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించి ఈసీ విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌కు ఈసీనే కార‌ణ‌మంటూ మ‌ద్రాస్ హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. దీంతో కొన్ని లోక్‌సభ స్థానాలకు జ‌ర‌గాల్సిన ఉప ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశారు. కానీ, వచ్చే సంవత్సరం మొద‌టిలో ఐదు రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొటోంది. కరోనా మహమ్మారికి భయపడేది లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత అన్నారు.

పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలకు మార్చి 2022తో అసెంబ్లీ కాలవ్యవధి ముగుస్తుండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మే చివరకు ముగియనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన మిని సంగ్రామం మాదిరిగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా ఉండనుంది. కరోనా వైరస్‌ విజృంభణ వేళ.. బీహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఎన్నికల నిర్వహణ నుంచి ఎంతో అనుభవాన్ని పొందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది. ప్రస్తుతం వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండడంతో వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది.

‘ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిప్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాం. దీంతో మాకు మరింత అనుభవం రావడంతోపాటు కరోనా విజృంభణ వేళ ఎన్నికల నిర్వహణలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్రా వెల్లడించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతన్న వేళ.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను వాయిదా వేస్తుందా? అన్న ప్రశ్నకు సుశీల్‌ చంద్రా ఈ విధంగా బదులిచ్చారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే మహమ్మారి ప్రభావం ముగిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దీంతో వచ్చే ఏడాది నాటికి కరోనా కష్టాలు తగ్గుతాయని సీఈసీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించే స్థితిలో కచ్చితంగా ఉంటామని సీఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గడువు ముగిసే నాటికి ఎన్నికలను సజావుగా నిర్వహించి, విజేతల జాబితాను గవర్నర్‌లకు అందజేయడం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యమని సుశీల్‌ చంద్రా గుర్తుచేశారు.