ప్రెసిడెంట్ గారూ…. ప్రెసిడెంట్ గారూ అని పిలిపించుకోవడనే తప్ప తన పేరు ఫణీంద్ర భూపతి అని కూడా మర్చి పోతాడు రంగస్థలం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన జగపతిబాబు.. ఆయన వీధి లోకి వెళ్తే లేచి నిలబడి చేతులు కట్టుకునే జనం, ఇంటికి వస్తే చెప్పులు విడిచి ఒంగుని నడిచే గనం కనిపిస్తారు. మా ఊరిలో ఫణీంద్ర భూపతి చెప్పిందే మాట చేసిందే శాసనం. అలాంటి ప్రెసిడెంట్ నియంతృత్వానికి దీటుగా నిలబడతాడు చిట్టిబాబు.. అదే రంగస్థలం సినిమా ప్రధాన కాన్సెప్ట్. సినిమా విషయాన్నీ పక్కనపెడితే గ్రామాల్లో ప్రెసిడెంట్ పదవి కోసం జరిగే రాజకీయాలు, తెరవెనుక మంతనాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాగే పదవిని వేరొకరి చేతుల్లో పెట్టకుండా చేసే కుట్రలు దాగి ఉంటాయి. గ్రామాల్లో ప్రెసిడెంట్ పదవి అంటే కేవలం ఓ సర్పంచ్ కుర్చీ కాదు. అదో ప్రతిష్ట కిరీటం.
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటినుంచి కుటుంబాలకు కుటుంబాలు గ్రామ సర్పంచులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. గ్రామ రాజకీయాల్లో తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలు కనిపిస్తాయి. కొన్ని కుటుంబాల్లోని వారంతా సర్పంచులు గా పనిచేసిన వారున్నారు. అలాగే గ్రామ మొదట పౌరుడు స్థానం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టిన వారు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఉన్నారు.
ఇది గోదావరి రాజకీయం
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం, భీమనపల్లి పంచాయతీ కు 1955 లో శిరంగు కుటుంబం నుంచి మొదటిసారిగా కుక్కుటేశ్వర రావు సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆయన ఏకంగా 15 సంవత్సరాలు 1970 వరకు గ్రామ సర్పంచ్ గా పని చేస్తే ఆయన తర్వాత తమ్ముడు వీర రాఘవులు సైతం పదకొండేళ్లు అదే గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. వీర రాఘవులు మరణం తర్వాత వీర రాఘవులు కొడుకు సత్తిరాజు 20 ఏళ్లు అదే గ్రామానికి సర్పంచ్గా ఎన్నికవుతూ వచ్చారు. ఈ గ్రామానికి శిరంగు కుటుంబం నుంచి దాదాపు 46 ఏళ్ళు గ్రామ సర్పంచులు గా పనిచేసిన వారే.
పి.గన్నవరం మండలం లంకల గన్నవరం జనాభా 5,400. ఈ గ్రామానికి డొక్కా కుటుంబం నుంచి ముగ్గురు సర్పంచులుగా ఎన్నికవుతూ వచ్చారు. 1950లో అక్క సుబ్బారావు మొదట సర్పంచిగా ఎన్నికై తే ఆయన 1970లో తన సొంత తమ్ముడు వెంకటరమణ సర్పంచిగా నిలబెట్టారు. సుబ్బారావు తర్వాత ఆయన కొడుకు ప్రభాకర్ మూర్తి కి రెండు పర్యాయాలు సర్పంచ్ గా గెలిపించుకోగలిగారు.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజు లంక పంచాయతీ మైనర్ పంచాయతీ. ఇక్కడ 4,600 ఓట్లు ఉన్నాయి. ఈ పంచాయతీ కు బులుసు వెంకట బ్రహ్మానందం 1970 నుంచి 1988 మధ్య పద్దెనిమిదేళ్లు సర్పంచ్ గా పని చేస్తే ఆయన తర్వాత ఆయన కుమారుడు డివి సుబ్బారావు 1988 నుంచి 1999 మధ్య రెండుసార్లు సర్పంచ్ గా గెలిచారు. మళ్ళీ ఆయన 2011 నుంచి 2018 వరకు మరో పర్యాయం కూడా ఆయన కొనసాగారు. 2001 నుంచి 2006 వరకు బ్రహ్మానందం భార్య అనసూయ సర్పంచ్ గా నిలబడి కుటుంబంలోనే వేర్వేరు పార్టీలు తరపున ప్రాతినిధ్యం వహించారు.
మలికిపురం మండలం లో నే లక్కవరం గ్రామపంచాయతీ కూడా మైనర్ పంచాయతీనే. ఇక్కడ 5600 ఓట్లు ఉంటాయి. ఈ పంచాయతీలో మంగెన కుటుంబం హవా ఎక్కువ. ఈ కుటుంబం నుంచి మొదట మంగిన వేణు గోపాలం 1956 నుంచి 1982 మధ్య గెలిచి సర్పంచ్ గా పనిచేశారు. ఆయన తర్వాత కుమారుడు వెంకట నరసింహారావు 1982 నుంచి 1995 మధ్య సర్పంచ్ గా పని చేస్తే గోపాలం సోదరుడు గంగయ్య 1989 నుంచి 1994 వరకు పంచాయతీ నుంచి రాజోలు ఎమ్మెల్యే గా పనిచేసారు. మంగిన కుటుంబంలో సభ్యులు అయిన రాధాకృష్ణ, భూదేవి లు జడ్పిటిసి గా పని చేస్తే ఆయన కుమార్తె కృష్ణ సూర్యకుమారి ఎంపీటీసీ గా పనిచేశారు.
అమలాపురం మండలం తాండవ పల్లి చిన్న గ్రామం. 1500 ఓటర్లు మాత్రమే ఉంటారు. అయితే ఈ చిన్న గ్రామం నుంచి పరమట కుటుంబంలో వీరరాఘవులు 1970 నుంచి 81 మధ్య గ్రామ సర్పంచ్ గా పని చేశారు. 1981లో అమలాపురం నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈయన తర్వాత భార్య ధనలక్ష్మి 1995 నుంచి 2000 వరకూ కుమారుడు శరత్ బాబు 2013 నుంచి 2018 వరకు అదే గ్రామానికి సర్పంచులు.
మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామ సర్పంచి స్థానం లంకె కుటుంబానికి ఎక్కువ సార్లు దక్కింది. లంకేశ్ రామరాజు 1981 నుంచి 1988 వరకు ఆయన కోడలు విజయలక్ష్మి 2001 నుంచి 2006 వరకూ ఆయన కుమారుడు శ్రీనివాసరావు 2013 నుంచి 2018 వరకు వరుసగా సర్పంచులుగా ఎన్నికవుతూ వచ్చారు.
పదవి ప్రతిష్ట!
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా కుటుంబ మార్కు ఎక్కువగా కనిపిస్తుంది. ప్రెసిడెంట్ గా పిలుచుకునే సర్పంచ్ పదవి కొన్ని కుటుంబాలకు ప్రతిష్టాత్మకం. దానిని దక్కించుకోవడానికి వారు ఎంతో ఆరాటపడతారు. మరో వ్యక్తి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. రిజర్వేషన్లు పుణ్యమా అని కొన్ని గ్రామాలకు బీసీ,ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం దక్కినా, అక్కడ సైతం తాము ప్రతిపాదించిన వారే ప్రెసిడెంట్గా నిల్చోబెట్టి తెర వెనుక రాజకీయం అంతా వీరే చేస్తూ గ్రామంలో తమ కుటుంబం నుంచి అధికారం పోకుండా జాగ్రత్త పడతారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. దాదాపు ఏకగ్రీవాలు చేసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆ కాకుండా పోటీ ఏర్పడితే మాత్రం దాని కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడతారు. మీరు ఏ పార్టీ మద్దతు మీద పోటీలో ఉన్నారో ఆ పార్టీ పెద్ద నాయకులను సైతం తమ గ్రామాల్లో తీసుకొచ్చేందుకు, పార్టీలో తమ పలుకుబడిని గ్రామంలో నిరూపించుకునేందుకు తాపత్రయపడుతూ తమ చేతి నుంచి అధికారాన్ని, ప్రాతినిధ్యాన్ని పక్కకు పోకుండా జాగ్రత్త తీసుకోవడమే అసలు కథ.