Idream media
Idream media
దువ్వాడ శ్రీనివాస్.. అనూహ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు చుక్కలు చూపెట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేస్తే వారిని చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ అన్యాయంపై గొంతెత్తారు.
అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడలో తొలిసారిగా ఎన్నికలు జరిగేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ వరించింది. ఇప్పటిదాకా పోటీ చేయడమే కానీ చట్ట సభల్లో ప్రవేశించని దువ్వాడ కు ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పటిదాకా తన రాజకీయం ఒక లెక్క. ఇకపైన మరో లెక్కగా సాగుతుంది అంటూ దువ్వాడ గట్టిగానే సౌండ్ చేస్తున్నాడు దువ్వాడ.
ఇప్పటి వరకూ టెక్కలిలో అచ్చెన్నాయుడు ఏం చేసినా అడిగే వారు లేకుండా పోయారన్న వాదనకు ఇక చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెక్కలిలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న దువ్వాడ.. అచ్చెన్నాయుడు చేసిన అరాచకాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారు. ఎమ్మెల్సీ కాక ముందు నుంచే టెక్కలి రాజకీయాలను దువ్వాడ కాక పుట్టించడం మొదలుపెట్టారు.
టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతూ ప్రజల, ప్రభుత్వ ఆస్తులను అచ్చెన్నాయుడు లూటీ చేశారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు రెండెకరాల నుంచి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తారని, ఇవన్నీ ఎక్కడినుంచి సంపాదించారో చెప్పాలంటూ మొత్తం కూపీలాగుతున్నారు. అచ్చెన్నాయుడు దౌర్జన్యాలు, అక్రమాలపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేసి న్యాయవిచారణ జరిపించాలన్నారు. అచ్చెన్నాయుడి తండ్రి హయాంనుంచే హత్యా రాజకీయాలు మొదలుపెట్టారన్నారు. రిగ్గింగ్‌లు, రౌడీయిజంతో కింజరాపు బ్రదర్స్ ఇంతకాలం టెక్కలి ప్రాంతంలో ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని చరిత్రను తవ్వుతున్నారు.
కింజరాపు బ్రదర్స్ అక్రమాస్తులు వేల కోట్లకు చేరాయని గతంలో ప్రకటించిన దువ్వాడ వీటన్నింటినీ న్యాయస్థానాల్లో సాక్ష్యాలతోసహా నిరూపిస్తామని ప్రకటిస్తున్నారు. ‘‘నిమ్మాడలో ప్రభుత్వ భూముల్లో ఎఫ్‌సీఐ గోడౌన్స్ నిర్మించి.. వారి కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజల భూముల్నిసైతం ఆక్రమించుకున్నారు. భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో 2014–19 మధ్య క్వారీల్లో రాళ్లను పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలించి కట్ చేశారు. ఇలా రూ.39 కోట్ల రాయిని అక్రమంగా తరలించారు. టెక్కలిలో కాంట్రాక్టుల పేరుతో కోట్లు మింగేశారు. సారా కాంట్రాక్టర్‌గా అచ్చెన్నాయుడు 75 షాపులు బినామీగా పెట్టుకుని మద్యం అక్రమ వ్యాపారాన్ని నడిపారు. రైస్ మిల్లర్లు, మద్యం షాపులవద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. పీఏసీఎస్ అధ్యక్షునిగా ఉన్న అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్ దాన్నడ్డుపెట్టుకుని బినామీల ఆస్తులపై రుణాలు తీసుకుని రూ.18 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడ్డారు. సింగపూర్‌లో హోటళ్లు, షిప్‌లు కూడా ఉన్నాయి’’ అంటూ అచ్చెన్న అక్రమాస్తుల చిట్టాను ఆయన వెలుగులోకి తెస్తున్నారు.
దువ్వాడ దూకుడుతో అచ్చెన్న వర్గానికి చమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న అచ్చెన్నాయుడును గతంలో చేసిన ఏ తప్పులు చుట్టుముడతాయోనన్న ఆందోళన పట్టిపీడిస్తోంది. సుదీర్ఘ కాలంగా రాజకీయాలు చేస్తూ తానేం చేసినా స్థానికంగా తిరుగులేకుండా సాగిన అచ్చెన్నకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నే అచ్చెన్న అరాచకాలను ఎదిరించిన దువ్వాడ శ్రీనివాస్.. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.