Idream media
Idream media
సాధారణంగా ఎన్నికల ముందు కనిపించే సీన్.. ప్రచార పర్వంలో దూసుకెళ్లేందుకు కాలనీ, బస్తీల్లో తమ బలం పెంచుకునే ఎత్తుగడ.. అన్ని రాజకీయ పార్టీల దృష్టి దానిపైనే. ఏ ప్రాంతంలో ఎవరి మాట నెగ్గుది..? ఏ వ్యక్తి తమ వెంట ఉంటే మేలు జరుగుద్ది! అంటూ జల్లెడ పడతారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలూ ద్వితీయ శ్రేణి నేతలకు వల వేస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ పార్టీ దివంగత నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి చేర్చుకుని అతనికే టికెట్ కేటాయించింది. దీంతో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి మరింత మందిని ఆకర్షిస్తోంది.
త్రిముఖ పోరులో టీఆర్ఎస్…
త్రిముఖ పోరులో మూడు పార్టీలూ స్థానికంగా బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాస్త ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తమ అభ్యర్థి సోలిపేట సుజాతకు పార్టీ బీ ఫాం ను అందజేసింది. నామినేషన్ల పర్వం కూడా మొదలు కానుంది. నామినేషన్లకు ముందే వలసలను ఆయా పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాయి. కొంత మందిని టార్గెట్ చేసి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అధికారపార్టీ కావడంతో టీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు. దీనికి తోడు అక్కడ మంత్రి హరీశ్ దగ్గరుండి చక్రం తిప్పుతున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గెలుపుపై నమ్మకానికి నిదర్శనం..
భారీ స్థాయిలో టీఆర్ఎస్ లోకి వలసలు వస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్‌లో నరసింహారెడ్డి, మనోహర్ రావు, బంగారయ్య లాంటి సీనియర్ నాయకులు టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నారంటే కారణం వారికి టీఆర్ఎస్ పట్ల ఉన్న నమ్మకమేనన్నారు. పార్టీలో చేరి దుబ్బాక ప్రజలకు న్యాయం చేస్తామని వారు అంటున్నారు. రోజురోజుకు ఎన్నికలు సమీపించిన కొద్ది టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ రోజు నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి యువకులు చాలా మంది పార్టీ వైపు వస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి చరిత్రలో నిలిచి పోతుందన్నారు.