iDreamPost
android-app
ios-app

Tollywood drugs case – డ్రగ్స్ వాడారా? అబ్బే అలాంటిది ఏమీ లేదు.. తేల్చేసిన ఈడీ!

Tollywood drugs case – డ్రగ్స్ వాడారా? అబ్బే అలాంటిది ఏమీ లేదు.. తేల్చేసిన ఈడీ!

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది. ప్రధానంగా నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి వచ్చే కేసులను మాత్రమే విచారణ జరిపే ఈడీ నాలుగేళ్ల నాటి కేసును దుమ్ము దులిపి మరీ కొత్తగా నోటీసులు జారీ చేసి డ్రగ్స్ పెడ్లర్స్ ను పక్కన పెట్టి మరీ సినీ నటులను విచారించింది. 2017 జులైలో డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్‌ మాస్కరెన్హాస్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన రాష్ట్ర ఆబ్కారీ శాఖ అధికారులు వారి నుంచి రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి మత్తు మందులు సరఫరా చేసేవాడినని కెల్విన్‌ పోలీసుల విచారణలో చెప్పడంతో అతను చెప్పిన పేర్ల ఆధారంగా సినీ ప్రముఖులను విచారించారు.

అయితే వారిపై సరైన ఆధారాలు లభించలేదని ఆబ్కారీ శాఖ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇదే విషయాన్ని సంగారెడ్డి ఎక్సైజ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. 16 మంది సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలో తాము సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు  లేకపోవడంతో 16 మంది సినీ ప్రముఖులకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి క్లీన్ చిట్ వచ్చింది. సినీ ప్రముఖులు ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. అది తేల్చాక కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.


అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా విచారణ ముగిసింది. ఈడీ కూడా కేసులో సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఎన్ని చేసినా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించని క్రమంలో కేసు మీద కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారించారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరికి కేసును మూసేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఏదైతేనేమి మొత్తం మీద ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి ఊరట లభిచినట్టు అయింది.