మూడు రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 2 విడుదలయ్యాక దానికి వచ్చిన స్పందన చూసి తెలుగు రీమేక్ పనులు వేగవంతం అయ్యాయి. నిన్న ఎఫ్3 కి కొంత బ్రేక్ ఇస్తూ త్వరలో వెంకటేష్ దృశ్యం సీక్వెల్ లో పాల్గొంటారని ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా దీనికి హైప్ వచ్చేసింది. ఆరేళ్ళ క్రితం వచ్చిన సినిమాకు కొనసాగింపు అందులోనూ మెప్పించేలా తీయడం అంటే మాటలు కాదు. కానీ జీతూ జోసెఫ్ ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ప్రైమ్ చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ వల్ల మళయాలం రానివాళ్లు కూడా సబ్ టైటిల్స్ సహాయంతో చూశారని ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది.
ఈ 2021లో వెంకటేష్ వి ఆల్రెడీ రెండు సినిమాలు విడుదల కన్ఫర్మ్ చేసుకున్నాయి. నారప్ప మే 14, ఎఫ్3 ఆగస్ట్ 27 డేట్లను ప్రకటించేశాయి. ఇప్పుడు దృశ్యం వేగంగా పూర్తవుతుంది కాబట్టి ఎంత లేదన్నా నెలన్నర లోపే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లిపోవచ్చు. జీతూ ఒరిజినల్ వెర్షన్ కు తీసుకున్న టైం ఇంతే. అది కూడా లాక్ డౌన్ టైంలో. ఈ రెండో భాగానికి ఫస్ట్ పార్ట్ లాగే సింగల్ లొకేషన్ సరిపోతుంది. కోర్ట్ సీన్లకు స్టూడియో ఇంటీరియర్ సరిపోతుంది. మీనా, నదియా తప్ప మరీ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు ఎవరూ లేరు. సో ఆ ఇద్దరి డేట్లను పక్కాగా లాక్ చేసుకుంటే మిగిలినవారితో ఏ సమస్య ఉండదు.
ఒకవేళ ఎఫ్2 కంటే ముందే దృశ్యం 2 వస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మంచి మార్కెటింగ్ ప్లాన్ కనిపిస్తోంది. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. ముగ్గురి రెమ్యునరేషన్లు తప్ప పెద్దగా భారం ఉండదు. పాటల కోసం ఫారిన్ లొకేషన్లు అవసరం లేదు. సెట్స్ తో అసలే పని లేదు. పెద్ద కాంపౌండ్ ఉన్న ఓ ఇల్లు, థియేటర్, కోర్టు, కొన్ని సన్నివేశాల కోసం ఆరు బయట రోడ్లు. అంతే. క్రేజ్ దృష్టా ఈజీగా దీని మీద పాతిక కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయొచ్చు. డిజిటల్ శాటిలైట్ హక్కులు వేరే. ఇందులో సగం కూడా సినిమా బడ్జెట్ కు అవసరం లేదు. అందుకే సురేష్ బాబు ఎక్కువగా ఆలోచించకుండా దృశ్యం 2కి శ్రీకారం చుట్టేశారు. అన్ని సవ్యంగా జరిగితే ఏకంగా వెంకటేష్ 3 సినిమాలు ఈ ఏడాది చూడొచ్చు