iDreamPost
android-app
ios-app

సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?

  • Published Mar 30, 2021 | 10:30 AM Updated Updated Mar 30, 2021 | 10:30 AM
సాగర్ బరిలో డాక్టర్.. బీజేపీ ప్రయోగం ఫలిస్తుందా..?

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలిసే దాకా ఎదురు చూసి.. తమ క్యాండిడేట్ ను ప్రకటించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉన్న కంకణాల నివేదిత రెడ్డిని కాదని.. ఎస్టీ (లంబాడా) సామాజిక వర్గానికి చెందిన పానుగోతు రవికుమార్ నాయక్ ను బరిలో నిలిపింది. మరి ఇంతకీ ఎవరీ రవి కుమార్? టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పోటీని తట్టుకుని నిలబడగలరా?

డాక్టర్ గా.. సమాజ సేవకుడిగా..

డాక్టర్ రవికుమార్ ది త్రిపురారం మండలం పలుగుతండా. కొన్నాళ్లు ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించారు. సివిల్‌ సర్జన్‌గా పని చేశారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. నిర్మల ఫౌండేషన్‌ పేరుతో నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బీజేపీలో చురుగ్గా పని చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సాగర్ అభ్యర్థి జానారెడ్డికి గతంలో ప్రధాన అనుచరుడుగా రవి కుమార్ ఉన్నారు. అయితే గత జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన.. తర్వాత బీజేపీలో చేరారు. జానారెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు.

రవికుమారే ఎందుకు?

సాగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఇంద్రసేనా రెడ్డి, కంకణాల నివేదితరెడ్డి, కడారి అంజయ్య యాదవ్ కూడా పోటీ పడ్డారు. పార్టీ తనకే టికెట్ ఇష్తుందనే నమ్మకంతో నివేదిత రెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. కానీ రవి కుమార్ వైపే బీజేపీ మొగ్గు చూపింది. అటువైపున రాజకీయంగా బలమైన కాంగ్రెస్ నేత జానా రెడ్డి, అధికార టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్ బరిలో నిలిచారు. అయితే రవికుమర్ ను అభ్యర్థికి ఎంచుకోవడంలో బీజేపీ కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంది. అందుకే 35 వేలకు పైగా ఓట్లు ఉన్న ఎస్టీ (లంబాడ) సామాజికవర్గానికి చెందిన రవిని ఎంచుకుంది. డాక్టర్ గా, సామాజిక సేవకుడికి జనాలకు పరిచయం ఉండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

రవికుమార్‌ సతీమణి పానుగోతు సంతోషి ప్రస్తుతం సర్పంచ్‌గా పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున త్రిపురారం మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో పలుగుతండా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

Also Read : తిరుపతి ఉప ఎన్నిక : టీడీపీ, బీజేపీ ఆ మాటెత్తడం లేదేమి..?

వారి ముందు నిలబడతారా?

కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి సుదీర్ఘ కాలంపాటు సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగానూ చాలా ఏళ్లు పని చేశారు. నాగార్జున సాగర్ లో ఆయనకు పట్టు ఎక్కువ. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో దెబ్బతిన్న పులిలా ముందుకెళ్తున్నారు. అందరికంటే ముందు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. యువత ఓట్లు రాబట్టుకునేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రెడ్డి సమాజిక వర్గ ఓట్లు ఇక్కడ 24 వేల వరకు ఉన్నాయి.

ఇక గత ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించి నోముల నర్సింహయ్య వెలుగులోకి వచ్చారు. కానీ అనారోగ్యంతో ఆయన డిసెంబ ర్ లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు నోముల భగత్ ను టీఆర్ ఎస్ ఎంపిక చేసింది. సింపతీ ఓట్లతోపాటు.. అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఆయనకు కలిసి రానుంది. భగత్ సామాజిక వర్గమైన యాదవుల ఓట్లు ఇక్కడ 36 వేలకు పైగా ఉన్నాయి. వీరిని దాటి గెలవాలంటే అటు రవికుమార్, ఇటు బీజేపీ బాగా కష్టపడాల్సిన పరిస్థితి. మొన్నటి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బీజేపీ.. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. దీంతో మళ్లీ గెలుపు ట్రాక్ లోకి ఎక్కాలని భావిస్తోంది. అభర్ధుల భవిష్యత్ వచ్చే నెల 2న తేలిపోతుంది.

Also Read : అభ్యర్థులు ఖరారు : ఇక తాడో, పేడో