iDreamPost
android-app
ios-app

టీడీపీ వికెట్లు టపటపా పడుతుంటే..తల్లడిల్లిపోతున్న తమ్ముళ్లు

  • Published Aug 29, 2020 | 8:18 AM Updated Updated Aug 29, 2020 | 8:18 AM
టీడీపీ వికెట్లు టపటపా పడుతుంటే..తల్లడిల్లిపోతున్న తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ తల్లడిల్లుతోంది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొందరు నేతలు చేజారిపోవడం పెద్దగా కలత చెందాల్సిన విషయం కాదు. కానీ టీడీపీ పరిస్థితి అలా లేదు. పార్టీలో మిగిలే నేతలెందరేనేదే అంతుబట్టడం లేదు. ఇప్పటికే గెలిచిన 23 మందిలో ముగ్గురు చేజారిపోయారు. మరో ఇద్దరు ఊగిసలాటలో ఉన్నారు. వారికి తోడుగా మరో అరడజను పేర్లు అనునిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. అంటే సగం మంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సంతృప్తి లేరనే చెప్పవచ్చు.

ఇక మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిన 152 మంది అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పటికే ఓ 20 మంది పార్టీని వీడిపోయారు. మరో 30 మంది మౌనంగా ఉన్నారు. మిగిలిన 100 మందిలో చంద్రబాబుకి తోడుగా ఉండేవారి సంఖ్య 50కి మించి కనిపించడం లేదు. అంటే 50 నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో మరో డజను మంది బాబు వెంట సాగేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే మొత్తంగా కలిపితే 60 నుంచి 70 నియోజకవర్గాల మధ్యలోనే ప్రస్తుతానికి టీడీపీ కి ఆనవాళ్లున్నాయి. అంటే మూడోవంతు సీట్లలో మాత్రమే టీడీపీకి కొంత ధీమా కనిపిస్తోంది.

ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలు, రాయలసీమలోని 56 సీట్లలో టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంద్రలో ఆరుగురు ఎమ్మెల్యేలు, రాయలసీమలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆపార్టీకి ఉన్నారు. వారిలో ఉత్తరాంధ్ర నేతల్లో నలుగురు నేతలు ఊగిసలాటలో ఉన్నారు. ఏ క్షణాన పార్టీని వీడినా ఆశ్చర్యం లేదు. రాయలసీమ ఎమ్మెల్యేలలో బాబుని మినహాయిస్తే మిగిలిన ఇద్దరూ క్రియాశీలకంగా కనిపించడం లేదు. పయ్యావుల కేశవ్ పూర్తి మౌనం పాటిస్తుండగా, బాలకృష్ణ దాదాపుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో అక్కడ కూడా టీడీపీ కి దిక్కులేకుండా పోయిందనే చెబుతున్నారు.

ఇక రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జిల్లాలు కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి చోట్ల టీడీపీ అనాథగా కనిపిస్తోంది. కడపలో టీడీపీ ఆఫీస్ గడప తొక్కేవాళ్లే కనిపించడం లేదు. కర్నూలులో కేఈ కుటుంబం వ్యూహాత్మక మౌనంతో ఉండగా అప్పుడప్పుడూ కనిపించే అఖిలప్రియ ఆళ్లగడ్డకే పరిమితం అవుతున్నారు. నెల్లూరులో సోమిరెడ్డి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అయిపోయారు. విజయనగరంలో అశోక్ గజపతిరాజుకి వయసు కూడా సహకరించకపోవడంతో టీడీపీ గాడి తప్పిందనే చెప్పవచ్చు

చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం కావడం, నియోజవర్గాల్లో నేతలు నైరాశ్యంలో ఉండడంతో టీడీపీ శ్రేణులు ఇప్పటికే చెల్లాచెదురయ్యే దశకు చేరుకున్నాయి. అనేక మంది సొంత దారి చూసుకుంటున్నారు. అత్యధిక కింద స్థాయి నేతలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఈ సారి విశేషంగానే చూడాలి. గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నప్పటికీ క్యాడర్ మాత్రం జగన్ వెంట నిలిచింది. దాంతో ఆయా నియోజవర్గాలలో వైఎస్సార్సీపీ మళ్లీ పుంజుకోవడానికి తోడ్పడింది. కానీ టీడీపీ పరిస్థితి అలా లేదు. క్యాడర్ జారిపోవడం, లీడర్లు సైలెంట్ గా ఉండడంతో టీడీపీకి తీవ్ర సమస్యలు తప్పవని స్పష్టమవుతోంది. ఆపార్టీ పూర్తిగా కుచించుకుపోతున్నట్టు స్పష్టమవుతోంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నట్టుగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగురవేసిన పార్టీ ఇప్పుడు ఏపీకి పరిమితం కాగా, త్వరలో అది ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరబోతుందనే వాదనకు ఈ పరిణామాలు తోడ్పడుతున్నాయి. జాతీయ అధ్యక్షుడినని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వానికి ఈ పరిస్థితిని అధిగమించే అవకాశాలు లేవనే అభిప్రాయం ఉండడంతోనే ఈ పరిస్థితి అనేది అత్యధికుల వాదన.