iDreamPost
android-app
ios-app

రఘువీరా రీ ఎంట్రీ!

  • Published Aug 24, 2021 | 8:26 AM Updated Updated Aug 24, 2021 | 8:26 AM
రఘువీరా రీ ఎంట్రీ!

రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ఆయన.. అనంతలో చక్రం తిప్పిన కీలక లీడర్. 2014 ఎన్నికల తర్వాత రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్నేళ్లుగా పాలిటిక్స్‌ను పూర్తిగా పక్కనబెట్టి.. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్న ఆయన.. ఈ మధ్యే తన సొంతూరులో ఆలయాన్ని నిర్మించారు. దీంతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారనే అంతా అనుకున్నారు. అయితే అనంతకే చెందిన ఓ కీలక నేతతో భేటీ కావడంతో మళ్లీ రాజకీయ వార్తల్లోకెక్కారు. ఈ సమావేశం అనంతలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్​రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది. అది అలా ఉండగానే.. ఇప్పుడు ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

జేసీ ప్రభాకర్ రెడ్డితో భేటీతో వార్తల్లోకి

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తన సొంతూరు నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఫ్యామిలీ ఆలయాన్ని నిర్మించింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న నీలకంఠేశ్వరుడి గుడిని రఘువీరారెడ్డి దగ్గరుండి మరీ పునరుద్ధరించారు. ఈ గుడిని ప్రారంభించిన తర్వాత అక్కడికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. రఘువీరారెడ్డితో సమావేశమయ్యారు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీలతో సంబంధం లేకుండా కీలక నాయకులను కలుస్తున్నానంటూ అప్పట్లో జేసీ వ్యాఖ్యానించారు. జెండాలు, అజెండాలు పక్కన బెట్టి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగులతో కూడా కలిసి ముందుకు సాగుతున్నానని, అందరూ ఒక్క తాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కానీ రఘువీరాను జేసీ ప్రభాకర్‌‌ రెడ్డి కలిసిన కారణం వేరే అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. రఘువీరా రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికే ప్రభాకర్ రెడ్డి వెళ్లారనే చర్చ జోరుగా జరిగింది. దీనిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు నేతలు చెబుతున్నారు.

Also Read : గోదావరి జిల్లాల ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా..?

కాంగ్రెస్‌ను వీడుతున్నారా?

1985లో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన రఘువీరా.. 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి రేసులో వినిపించిన పేర్లలో రఘువీరా పేరు కూడా ఉంది. కానీ ఆయనకు ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. కీలక నేతలందరూ పార్టీకి గుడ్ బై చెప్పినా.. కష్టకాలంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా రఘువీరా కొనసాగారు. తర్వాత పలు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. తన గ్రామానికే పరిమితమై.. వ్యవసాయం, గుడి నిర్మాణ పనుల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు గుడి నిర్మాణం పూర్తి కావడంతో ఆయన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తారని నేతలు చెబుతున్నారు. జేసీతో భేటీ ఇందులో భాగమేనని అంటున్నారు.

మరోవైపు ఏపీలో పార్టీని బలపరచాలని, పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కీలక నేతలు ఇటీవల వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రఘువీరాకు ఏఐసీసీ పెద్దల నుంచి కబురు వచ్చినట్లు చర్చ నడుస్తోంది. అయితే ఏపీలో పూర్తిగా భూస్వాపితం అయిపోయిన పార్టీలో ఆయన కొనసాగుతారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు సొంత పార్టీ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, టీడీపీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయట. అయితే రఘువీరా టీడీపీలో చేరబోతున్నారని బలమైన టాక్ పొలిటికల్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతం కోసం రఘువీరా రెడ్డి దగ్గరికి జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబే పంపారని, పార్టీలో చేరేందుకు రఘువీరా కూడా సుముఖం వ్యక్తం చేశారని నేతలు చెబుతున్నారు. త్వరలోనే పచ్చ కండువా కప్పుకోబోతున్నారని అంటున్నారు. చూద్దాం.. ఏమవుతుందో?

Also Read : ఏమిటీ అగ్రిగోల్డ్ స్కామ్..? ప్రభుత్వం ఎందుకు డిపాజిట్లు చెల్లిస్తుంది ..?