డాలర్ శేషాద్రి. తెలుగు నాట అత్యధికులకు చిరపరిచితమైన పేరు. తిరుమల వ్యవహారాల్లో తలపండిన అర్చకుడిగా ఉన్న శేషాద్రి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. కార్తీక మాస ఉత్సవాల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన ఆయన ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆస్పత్రికి తరలించేలోపు ఆయన తుదిశ్వాస విడిచారు.
1978లో ఆయన టీటీడీ కి చెందిన వెంకటేశ్వరుని ఆలయంలో అర్చకునిగా విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం శ్రీవారి సేవలో ఉన్నారు. కీలక సందర్భాల్లో డాలర్ శేషాద్రి ముఖ్యభూమిక పోషించారు. 2007లో రిటైర్ అయినప్పటికీ ఓఎస్డీగా మళ్లీ విధుల్లో చేరారు. ఆయన సేవలను కొనసాగించాలనే లక్ష్యంతో టీటీడీ మరో అవకాశం ఇచ్చింది. దాంతో ఆయన ప్రస్తుతం ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.
శేషాద్రి పలు వివాదాల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా శ్రీవారి డాలర్ల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయనకు సంబంధం లేదని తేల్చినప్పటికీ డాలర్ శేషాద్రి అనే ముద్ర మాత్రం పడింది. ఆ పేరుతోనే ఆయన కీర్తి గడించారు. అయితే మీడియానే తనను డాలర్ శేషాద్రిగా ముద్ర వేసిందని ఆయన ఓ సందర్భంలో తెలిపారు. తన మెడలో పెద్ద డాలర్ ధరించిన మూలంగా ఆ పేరుతో పిలిచారంటూ శేషాద్రి వెల్లడించారు.
డాలర్ శేషాద్రి లేని లోటు పూడ్చలేనిదని టీటీడీ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శేషాద్రి మృతదేహాన్ని తిరుపతికి తరలించి , అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 43 ఏళ్ల పాటు టీటీడీలో పనిచేసిన కీలక అధికారి మరణం తిరుమల సిబ్బందిలో విషాదాన్ని నింపింది.
Also Read : Shiva Shankar Master : శివ శంకర్ మాస్టర్ – పేరు కాదు ఒక బ్రాండ్