శాసనమండలి లో టీడీపీ పక్ష ఉపనాయకుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. రాజధాని వికేంద్రీకరణ మీద నేడు శాసనమండలిలో చర్చ జరగనుండగా ఈ ఉదయం మాణిక్య వరప్రసాద్ తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు పంపించారు.
రాజీనామా లేఖలో అమరావతి వికేంద్రీకరణకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ లేఖ మీద భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మంచి ఉపన్యాసకుడయినా మాణిక్య వరప్రసాద్ శాసన మండలిలో తన వాదనను వినిపించి చర్చ ముగింపు సందర్భంగా రాజీనామా చేయకుండా చర్చకన్నా ముందే ఎందుకు రాజీనామా చేసారు అన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఈ ఉదయం టీడీపీ ఎమ్మెల్సీలు “రూల్ 71” కింద చర్చ జరపాలని మండలి చైర్మన్ కి నోటీసులు ఇచ్చారు. దానిమీద జరిగిన ఓటింగ్ లో ముప్పై మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో ఏడు రోజుల్లో అమరావతి వికేంద్రీకరణ మీద తప్పనిసరిగా చర్చ జరపాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. శాసన మండలిలో టీడీపీదే ఆధిక్యత కావటం వలన మండలిలో మొదటి నుండి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి సీనియర్ నేత అమరావతి మీద చర్చకు నాయకత్వం వహించకుండా ముందస్తుగా ఎందుకు రాజీనామా చేసారో? ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే అనుకున్నా సభలో బహిరంగంగా నిరసన వ్యక్తం చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు?
గత రెండు నెలలుగా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేస్తారని గుంటూరు టీడీపీ వర్గాలలో చర్చ నడుస్తుంది. మాణిక్య వరప్రసాద్ కూడా ఒక విలేకరుల సమావేశంలో మీకు చెప్పే రాజీనామా చేస్తాను అనడం గమనార్హం.
వ్యక్తిగతంగా మాణిక్య వరప్రసాద్ “అమరావతి మోడల్”కు మొదటినుండి వ్యతిరేకమే. వికేంద్రీకరణ జరగాలని అనేక సందర్భాల్లో బహిరంగంగానే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణను పూర్తిగా తిరస్కరించకుండా లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రాజధానులు అమరావతిలోనే ఉంచి హైకోర్టును కర్నూల్ కు అమరావతి చుట్టూ చంద్రబాబు ప్రతిపాదించిన 9 నగరాలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలించాలన్న అభిప్రాయాన్ని జర్నలిస్టుల వద్ద వ్యక్తం చేసేవారు.
ఈ కారణాలన్నీ పరిశీలిస్తే చర్చకు ముందే ఈరోజు మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడాన్ని కేవలం రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అనుకోలేము. ఏమైనా మరి కొద్దిసేపట్లో మాణిక్య వరప్రసాద్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపిన మాణిక్య వరప్రసాద్ స్పీకర్ ఫార్మాట్ లో మండలి చైర్మన్ కు రాజీనామాను సమర్పించింది లేనిదీ తెలియాల్సి ఉంది.