iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ధ్వంసం చేశారు అంటూ నిత్యం గొంతు చించుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు తమ దుష్ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు. ఏవేవో లెక్కలు తెరపైకి తెచ్చి తమ వాదనను జనం నమ్మేలా చేయాలని చూస్తున్నారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. తన వాదనను బలపరిచేందుకు కొన్ని గణాంకాలను ఉదహరించారు కూడా. వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. 11 రాష్ట్రాలు చేబదుళ్లు లేకుండా, 22 రాష్ట్రాలు ఓడీ లేకుండా..15 రాష్ట్రాలు స్పెషల్ డ్రాయింగ్‌లు లేకుండా పాలన చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రాలపై కరోనా ప్రభావం లేదా? అని ప్రశ్నించారు.
పట్టాభి లెక్కలు కరెక్టేనా?
నోరు విప్పితే అబద్ధాలాడే టీడీపీ నాయకులు గణాంకాలతో వాదన మొదలెట్టారంటే ఏదో తిరకాసు ఉంటుంది అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. పట్టాభి చెప్పిన లెక్కలు ఎక్కడ తీసుకున్నారు? వాటికి ఉన్న ప్రామాణికత ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శిస్తున్న పట్టాభి.. అసలు ఆ రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడడం సబబేనా? చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అన్నట్టు ఉండే ఈశాన్య రాష్ట్రాలెక్కడ.. ఐదు కోట్ల జనాభాతో, విభజన కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి బావుండేది. విభజన సమయంలో జనాభా ఎక్కువ, ఆదాయ వనరులు తక్కువతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. కేంద్రం రెవెన్యూ లోటు ఇప్పటికీ భర్తీ చేయకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, ఇస్తానన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు పుణ్యమాని అటకెక్కించడం వంటి కారణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది.
బాబు నిర్వాకం వల్లే ఈ దుస్థితి
గోరు చుట్టుపై రోకలిపోటు చందంగా అసలే ఆర్థిక ఇబ్బందుల్లోఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లు చంద్రబాబు పాలించడం కూడా రాష్ట్రానికి శాపమైందని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. రుణ పరిమితికి మించి అప్పులు చేయడం, రూ.49.500 కోట్ల బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి వెళ్లడం, అమరావతి రాజధాని పేరిట విపరీతంగా ప్రజాధనం దుబారా చేయడం వంటి కారణాలతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆర్థిక విధ్వంసం అంతా చంద్రబాబు హయాంలో జరిగితే ఏ మాత్రం సిగ్గులేకుండా ఆ పాపాలన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై రుద్దేయాలని చూడడం టీడీపీ కుట్ర రాజకీయానికి నిదర్శనం. ఆ రాష్ట్రాలపై కరోనా ప్రభావం లేదా? అక్కడ ఇన్ని అప్పులు చేయడం లేదు కదా అని ప్రశ్నిస్తున్న పట్టాభికి.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న సంగతి తెలియదా? కరోనా కష్టకాలంలో సామాన్యుల జీవన ప్రమాణాలు పడిపోకుండా చర్యలు తీసుకున్న జగన్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్న విషయం పట్టదా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : సోమిరెడ్డి ఉపరాష్ట్రపతికి చెప్పడం వల్లేనట..!