iDreamPost
android-app
ios-app

ఇసుక ర్యాంపు కోసం కొట్లాట.. మరచిపోయారా బుచ్చయ్య ..?

ఇసుక ర్యాంపు కోసం కొట్లాట.. మరచిపోయారా బుచ్చయ్య ..?

తాము ఏం చేశామో.. తమ స్థానంలోకి వచ్చిన వారు కూడా అదే చేస్తారనే భావనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నట్లున్నారు. అవినీతి, అక్రమాలు, భూ దందా, ఇసుక దొపిడీ.. అంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్నారు. బాబు హాయంలో జరిగిన భూ దందాలు, అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న సమయంలో.. తమపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందంటూ చెప్పుకొస్తున్న టీడీపీ నేతలు.. వైసీపీ నేతలపై కూడా ఆరోపణలు చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా.. టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇసుకను అడ్డగోలుగా అమ్ముకుని కోట్లు గడించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చేసినట్లుగానే ఆ పార్టీ నేతలు ఇసుక వ్యాపారం చేస్తున్నారనే భావనతో.. విమర్శలు చేస్తున్నారు.

ఇసుక వ్యవహారంలో తాజాగా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వైఎస్‌ జగన్‌ సారధ్యంలో రాష్ట్రంలో ఇసుక దందా జరుగుతోందని, జేపీ కంపెనీ 10 టన్నుల ఇసుకకు డబ్బులు కట్టించుకుని 8 టన్నులే సరఫరా చేస్తోందని ఆరోపించారు. రోజుకు ఉభయగోదావరి జిల్లాలో రెండు కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 కోట్ల రూపాయలు దందా సాగుతోందని గణాంక సహితంగా విమర్శలు చేస్తున్నారు.

ఇసుక దందా గురించి రాష్ట్రంలో అనర్గళంగా మాట్లాడగలిగే వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. ఈ వ్యవహారంలో ఆయనకు ఆపార అనుభవం ఉంది. 2014లో రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గెలిచిన గోరంట్ల.. అప్పటి సిటీ ఎమ్మెల్యే (బీజేపీ) ప్రస్తుత వైసీపీ కో ఆర్డినేటర్‌ ఆకుల సత్యనారాయణతో ఇసుక ర్యాంపు కోసం గొడవ కూడా పడ్డారు. మాటలతో మొదలైన ఈ గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరినొకరు గోర్లతో మొహాలపై రక్కుకున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున కుమారీ టాకీస్‌ ఇసుక ర్యాంపుపై అజమాయిషీ కోసం ఈ ఇద్దరు నేతలు గొడపడ్డారు. కుమారీ టాకీస్‌ ఇసుక ర్యాంపు తన నియోజకవర్గ పరిధిలోనిది అంటూ ఎవరికి వారు వాదులాడుకున్నారు. కొట్టుకున్న తర్వాత.. రాజీ చేసుకుని దందాను ఎంచక్కా కొనసాగించారు.

ఈ ర్యాంపుతోపాటు ధవళేశ్వర్యం, వేమగిరి ర్యాంపులలో తన అనుచరులను పెట్టి మరీ గోంరట్ల బుచ్చయ్య చౌదరి ఇసుకను యథేచ్చగా విక్రయించారనే విమర్శలు ఆ పార్టీ నేతలే గతంలో చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను ఆపిన పోలీసులను బెదిరించిన ఘటనలు ఉన్నాయి. ఇసుక వ్యవహారంలో వేలు పెడితే కాలిపోతావ్‌.. అంటూ రాజమహేంద్రవరం టూ టౌన్‌ నూతన సీఐకు బెదిరింపులు రావడం అప్పట్లో పోలీసు వర్గాల్లో సంచలనమైంది. ఈ వ్యవహారాలన్నీ మరిచిపోయిన గోరంట్ల.. వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నిస్తుండడం చూస్తున్న వారు ముక్కునవేలేసుకుంటున్నారు.

Also Read : ఆ మాజీ ఎమ్మెల్యే మేయర్ పీఠం పై కన్నేశారా..?