iDreamPost
android-app
ios-app

పగోడికీ వద్దు పవన్‌ కళ్యాణ్‌ కష్టం

పగోడికీ వద్దు పవన్‌ కళ్యాణ్‌ కష్టం

2019 ఎన్నికల ఫలితాలు వెలువడి ఈ రోజు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌కు అతి కష్టమైన రోజు. పవన్‌ కళ్యాణ్‌కు ఇలాంటి కష్టం రాకూడదని ఆయన పగోడు(శత్రువు) కూడా అనుకునే సందర్భమది. తన రాజకీయ జీవితంలో తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోయారు. ప్రతి నేతకు ఓటమి గెలుపు సహజమే అయినా.. పవన్‌ కళ్యాణ్‌ విషయం అంతకు మించి. ఎందుకంటే.. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం జరగలేదని పోటీకి దూరంగా ఉండి, ఐదేళ్లపాటు రాజకీయాలు చేసి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా, అభిమానుల మనస్సుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడమే ఇక్కడ ఆయన, ఆయన అభిమానులు జీర్ణించుకోలేని విషయం.

ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ఏరి కోరి ‘తన’వాళ్లు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల్లో పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. తన అన్న చిరంజీవిలాగా రెండు చోట్ల పోటీ చేస్తే.. కనీసం ఒక్కచోటైనా గెలుస్తాననే అపార నమ్మకంతో బరిలోకి దిగిన జనసేనానికి శృంగభంగం తప్పలేదు.

పవన్‌ కళ్యాణ్‌ 2014 ఎన్నికలకు ముందు సొంతంగా జనసేన అనేపేరుతో పార్టీ పెట్టినా.. ఆయన రాజకీయ జీవితం 2008లోనే మొదలైదని చెప్పవచ్చు. తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రమంతా విరివిగా ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనుకున్న ప్రజారాజ్యం 18 సీట్లతో సరిపెట్టుకోవడంతో ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌ అన్న చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. ప్రజా రాజ్యం పార్టీని రెండున్నరేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలోనూ మాట్లాడలేదు. అయితే జనసేన స్థాపించిన తర్వాత పవన్‌.. ప్రజారాజ్యం పార్టీ గురించి, తన అన్న చిరంజీవి గురించి ప్రస్తావించడం గమనార్హం.

జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడు, రాసిపెట్టుకోండి.. అంటూ మీడియాతో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ జగన్‌ వ్యతిరేకులకు ఆశలు కల్పించారు. అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఎమ్మెల్యే అవుతారో నిర్ణయించేది తాను కాదని, ప్రజలని పవన్‌ కళ్యాణ్‌కు 2019 మే 23న బోధపడింది. 175 సీట్లకు గాను వైసీపీ 151 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. పవన్‌ కళ్యాణ్‌ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి చరిత్రకెక్కారు. పుండు మీద కారం చల్లినట్లుగా.. జనసేన తరఫున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు గెలవడం పవన్‌కు మానని గాయంలా మారిందని చెప్పవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ ఓటమిని రాపాక గెలుపు ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉండడం పవన్‌ అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది.

తాను గెలిచినా ఓడినా గాజువాక, భీమవరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, సినిమాలు ఇక చేయబోనని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ ఆ మాట తప్పారు. తాను పోటీ చేసిన నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం అటుంచితే.. కనీసం నెలకోసారైనా ఆ నియోజకవర్గాల మొహం చూడడంలేదు. ఇక సినిమాలు చేయనని మళ్లీ చేస్తుండడంతో నిలకడలేని వ్యక్తితో రాజకీయాలు చేయడం కష్టమని భావించిన నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు.

2024లోనైనా తమ అభిమాన నటుడు సీఎం కాకపోయినా కనీసం ఎమ్మెల్యేగా చూసుకుందామనుకుంటున్న అభిమానులకు పవన్‌ తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. పార్టీని నాదేండ్ల మనోహర్‌కు అప్పజెప్పిన పవన్‌.. తీరిక సమయాల్లో హైదరాబాద్‌ నుంచి పార్టీ సమీక్షలు చేస్తున్నారు. మళ్లీ 2024 ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు పూర్తిగా రంగంలోకి దిగవచ్చని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు.