iDreamPost
android-app
ios-app

చంద్రబాబు ను మ‌రిచిపోయారా?

చంద్రబాబు ను మ‌రిచిపోయారా?

దేశంలో కొద్ది రోజులుగా కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ప‌లు పార్టీల నేత‌లు స‌మావేశం అవుతూ కొత్త ఫ్రంట్ వార్త‌లను తెర‌పైకి తెస్తున్నారు. కొంద‌రు ఆ ఆలోచ‌న లేదంటున్నా.. భేటీలు, క‌ల‌యిక‌లు రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ భేటీలు, వార్త‌ల్లో ఎక్క‌డా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న రావ‌డం లేదు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిన‌ని చెప్పుకునే ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆయ‌న బీజేపీతో అంట‌కాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నో, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నారో తెలియ‌దు కానీ బీజేపీ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్లో బాబు ప్ర‌స్తావ‌న మాత్రం రావ‌డం లేదు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్త‌య్యాక దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేగ‌వంతం అవుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి, కాంగ్రెస్ లేకుండా అంటూ రకరాకల చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏదైనా మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం జరుగుతోంది. కాగా, 2019 ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పెద్ద ఉద్యమమే చేశారు. దేశవ్యాప్తంగా ప‌లువురు నేత‌ల‌ను కూడగట్టారు. మోదీ ఓడితేనే దేశం బతుకుతుందని గళం ఎత్తారు. ఇతర ప్రాంతీయ పార్టీలను కలిపి స‌మావేశాలు పెట్టారు. చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీతో కూడా జత కట్టారు చంద్రబాబు. 2019 ఎన్నిక‌ల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయిన త‌ర్వాత అంతా తారుమారైంది. మ‌రోసారి ప్రధానిగా మోదీ మరింత మెజార్టీతో గెల‌వ‌డంతో జాతీయస్థాయిలో టీడీపీ సైలెంట్‌ అయింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూడా ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతోంది.

బ‌హుశా ఈ కార‌ణాల వ‌ల్ల‌నేమో దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చల సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న రావ‌డం లేదు. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. 2019లో పెద్దఎత్తున బీజేపీ వ్యతిరేక పోరాటం చేసిన చంద్రబాబు.. ఆ చర్చల్లోకి వెళ్లడానికే ఇష్టపడటం లేదు. 2019 ఎన్నికల తరువాత మోడీకి దగ్గరగా ఉండేందుకు టీడీపీ చీఫ్‌ ప్రయత్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చినా.. పెద్దగా లెక్క పెట్టలేదు. రాష్ట్రంలో అధికారంలేని సమయంలో ఇటు సీఎం జగన్‌తో పోరాడుతూ.. అటు ప్రధానితోనూ వైరం మంచిది కాదని భావిస్తూ వచ్చారు. దేశంలో మోడీ వ్యతిరేకంగా కొందరు జట్టు కడుతున్నా.. చంద్రబాబు మాత్రం అటుగా చూసేందుకు కూడా సిద్ధంగా లేరు.

2019 ఎన్నికల తరవాత చంద్రబాబు కేంద్రంపట్ల అనుసరించిన వైఖరి వల్ల ఇతర జాతీయ నేతల్లో పలుచన అయ్యారని టాక్‌. తరుచూ ఆలోచనలు మార్చుకునే చంద్రబాబుతో కష్టమని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు కూడా నిర్ణయానికి వచ్చేశారట. అందుకే దేశంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరు ఎక్కడా వినిపించడం లేదని కొందరి వాదన. టీడీపీ చీఫ్ కూడా ఏ ఫ్రంట్ చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరట. రాష్ట్రంలోని వ్యవహారాలతోనే ఆయన తీవ్రంగా సతమతం అవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో పార్టీనికి కాపాడుకోవడమే ఇప్పుడు చంద్ర‌బాబుకు పెద్ద స‌వాల్ గా మారింది. ఇటువంటి స‌మ‌యంలో ఫ్రంట్ అంశానికి దూరంగా ఉండ‌డ‌మే మేల‌నే ఆలోచ‌న‌లో ఆ పార్టీ వ‌ర్గాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : జ‌గ‌న్ పేద‌ల ప‌క్ష‌పాతి, ఇదిగో నిద‌ర్శ‌నం