iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణ..?

  • Published Jul 08, 2021 | 12:56 PM Updated Updated Jul 08, 2021 | 12:56 PM
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణ..?

‘‘తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. పార్టీ మారబోతున్నారట.. త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారట’’ చాలా రోజులుగా వినిపిస్తున్న మాటలివి. టీఆర్ఎస్ నుంచే కాదు.. బీజేపీ నుంచి కూడా పిలుపు వచ్చిందని ఎల్.రమణ గతంలో చెప్పారు. కానీ ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అవుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు వెళ్లి టీఆర్ఎస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్.రమణ పోటీ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన చర్చల వల్లే ఇన్నాళ్లు లేటయిందని, లేదంటే ఈ పాటికే టీఆర్ఎస్ లోకి రమణ చేరిపోయేవారనే టాక్ వినిపిస్తోంది.

అధికార పార్టీకి అభ్యర్థి లేక..

తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. దుబ్బాకలో మినహా ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. బీజేపీ కాస్త బలపడినా.. రేవంత్ వల్ల కాంగ్రెస్ కొంత రేసులోకి వచ్చినా.. రాష్ట్రంలో అధికార పార్టీ పట్టు ఏమాత్రం తగ్గలేదు. కానీ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కొన్ని నెలల కిందట టీఆర్ఎస్ కు, ఇతర పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలోకి చేరారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. చాలా ఏళ్లుగా టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రత్యర్థి అయ్యారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదు. బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి లేదా కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుని పోటీలో పెడుతారని వార్తలు వినిపించాయి. ఇక తమ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం లేదా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి నిలబెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈటలకు వీళ్లు పోటీగా నిలవలేరని టీఆర్ఎస్ అధినేత భావించినట్లు సమాచారం.

బీసీ అభ్యర్థిపై బీసీ అభ్యర్థి

హుజూరాబాద్ లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బీసీల్లో ఫాలోయింగ్ ఉన్న నేత ఈటల రాజేందర్. కానీ ఆ స్థాయిలో అభ్యర్థికి టీఆర్ఎస్ దొరకలేదు. దీంతో ఎల్.రమణ వైపు గులాబీ పార్టీ చూసింది. బీసీ నేత కావడం, టీటీడీపీ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయన్ను నిలబెట్టాలని భావిస్తోంది. కేవలం ఉప ఎన్నిక కోసమే కాకుండా… ఈటల రాజేందర్ వ్యవహారంలో అసంతృప్తితో ఉన్న బీసీలను సంతృప్తి పరిచేందుకు కూడా రమణను చేర్చుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. అందుకే బీసీ నేతపై బీసీ నేతను నిలబెట్టాలనే వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అమలు చేస్తుందన్న వాదనలు వినిపించాయి. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్‌కు టికెట్‌ ఇచ్చి.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించారు. తద్వారా జానారెడ్డిని సైలెంట్ చేశారు. ఇప్పుడు ఇక్కడా ఇలానే చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని కొందరు నేతలు చెప్పారు. కానీ సాగర్ ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కాదని సీఎం భావించారని తెలుస్తోంది.

Also Read : వైఎస్ షర్మిలకు కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పడం వెనుక మర్మం ఏమిటి..?