iDreamPost
android-app
ios-app

బుచ్చయ్య కష్టానికి ఫలితం దక్కుతుందా..?

బుచ్చయ్య కష్టానికి ఫలితం దక్కుతుందా..?

కమ్యూనిస్టు భావాలు ఉన్న నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు బుచ్చయ్యకు ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో వైసీపీపై ఒంటికాలిపై లేచారు. అసెంబ్లీలో వాణి బలంగా వినిపించారు. అయితే తాను ఆశించిన మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని ఆ తర్వాత సైలెట్‌ అయ్యారు. వైసీపీపై దూకుడు తగ్గించారు. తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

పార్టీలో ఆది నుంచి ఉన్న నాయకుడు, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్లకు చంద్రబాబు మూడు టర్మ్‌లలోనూ మంత్రిపదవి దక్కలేదు. మూడో దఫాలో 2019 వరకూ ఆశలు పెట్టుకున్నారు. అయితే బుచ్చయ్య ఆశలపై నీళ్లు చల్లేలా చంద్రబాబు.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 23 మందిలో నలుగురుకు మంత్రిపదవులు ఇచ్చారు. దీంతో బుచ్చయ్యలో ఆగ్రహం గోదావరి వరదలా మహోగ్రరూపం దాల్చింది. బాబు తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ పెట్టిన ఉద్దేశం ఏమిటి..? బాబు చేస్తున్న నిర్వాకం ఏమిటని కడిగిపారేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సద్దుమణిగినా.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టలేదు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించన వారు ఇప్పుడు సైలెంట్‌ అయినా.. బుచ్చయ్య చౌదరి మాత్రం ప్రతిపక్షం తరఫున గళం వినిపిస్తున్నారు. టీడీపీ ఉనికిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన సహజశైలికి భిన్నంగా కూడా స్పందిస్తూ చులకన అవుతున్నారు. వయస్సు, అనుభవానికి తగినట్లుగా బుచ్చయ్య చౌదరి రాజకీయాలు చేయడం లేదనే అపవాదులు మీద వేసుకుంటున్నారు. మీడియా చర్చల్లోనూ, సోషల్‌ మీడియాలోనూ అనుచితమైన వ్యాఖ్యలు, పోస్టులు పెడుతూ ప్రత్యర్థుల చేతిలో ట్రోల్‌కు గురవుతున్నారు.

ఇంత చేస్తున్న బుచ్చయ్య చౌదరికి తగిన గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం ఈ సారైనా బాబు ఇస్తారా..? మరి కొద్ది రోజుల్లో టీడీపీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు.. వివిధ విభాగాలకు నేతలను నియమించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి బుచ్చయ్య చౌదరికి ఎలాంటి పోస్టు ఇస్తారో వేచి చూడాలి.