iDreamPost
iDreamPost
కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి, విస్తృతిపై మొదటి నుంచీ అనేకానేక సందేహాలు, సవాలక్ష అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టు నిపుణులనుకునే వారిని నుంచి కూడా ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటనలు వెలువడుతుండడంతో ప్రజల్లో తీవ్ర సందిగ్ధతే ఉందనడంలో సందేహం లేదు.
గాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గురించి ఆదినుంచీ విభిన్న వాదనలే విన్పిస్తున్నాయి. దాదాపు రెండొందల మందికిపైగా వైద్య నిపుణులు గాలిద్వారా వ్యాపించేందుకు అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖరాసి కలకలం రేపారు. దీంతో కోవిడ్ నిబంధనల్లో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఆ తరువాత గాలి ద్వారా వ్యాపించే విషయంలో తన అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చుకుంది. పరిశీలన చేస్తున్నామని ప్రకటించి మిన్నకుండిపోయింది. ఆ తరువాత కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు ఎక్కడా విన్పించలేదు.
అయితే తాజాగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సంస్థ గాల్లో వైరస్ వ్యాప్తిని నిర్దారించి మరోసారి చర్చకు తెరలేపింది. కాగా భిన్నవాదనలు ఈ అంశంపై ఉన్నప్పటికీ వారందూ ఏకీకృతంగా చెబుతున్నవి కొన్ని ఉన్నాయి. వ్యక్తికీ వ్యక్తికీ మధ్య ఆరు అడుగుల భౌతికదూరం, గాలీ, వెలుతురు బాగా వచ్చే గదుల్లో ఉంటే వైరస్ గాలిద్వారా వ్యాపించేందుకు అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయని చెబుతున్నారు. అంటే గదిలో ఉన్నప్పటికీ ధారాళంగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం లాంటివాటిని పాటిస్తే వైరస్ భారి నుంచి తప్పించుకోవచ్చనేది సదరు నిపుణుల అభిప్రాయాల్లో సారంగా ఉంటోంది.
అలాగే అమెరికాకే చెందిన మరో సంస్థ పెద్ద తుంపరల ద్వారానే కాకుండా సూక్ష్మంగా ఉండే తుంపరల ద్వారా కూడా గాల్లో ఎక్కువసేపు వైరస్ ఉంటోందని తేల్చింది. మూసి ఉన్నట్టు ఉండే గదుల్లో ఈ సూక్ష్మతుంపరల కారణంగానే గది మొత్తం వైరస్ వ్యాపించి, ఎక్కువ మందికి వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఏర్పడుతున్నట్టుగా తేల్చింది.
పూర్తిస్థాయిలో జనజీవనం రోడ్లపైకి వస్తోంది. కార్యాలయాలకు కూడా వెళతున్నారు. సో.. తాజాగా వెలువడుతున్న నివేదికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మరింత అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.