iDreamPost
android-app
ios-app

బాబు.. మోడీని ఒప్పిస్తారా..?

బాబు.. మోడీని ఒప్పిస్తారా..?

ప్రజల్లోకి వచ్చేందుకు ఏ అంశం దొరకడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే సమస్య కనిపించడం లేదు. కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రజలు తమ కనీస అవసరాలకు ఇబ్బంది పడలేదు.. పార్టీ పరిస్థితి నానాటికీ తీసిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు పాలుపోవడం లేదు. అందుకే దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని రాజకీయం చేసేందుకు సిద్ధపడుతున్నారు. కరోనా బాధితులు, మరణించిన వారికి కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.

టీడీపీ లెక్క తెలుస్తుందట..

రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని టీడీపీ ఆరోపిస్తుంది. కరోనా మృతుల సంఖ్య ఎంతో తామే తేలుస్తామని చెబుతూ రాజకీయాలను కొత్తపుంతలను తొక్కిస్తోంది. కరోనా బారినపడి కోలుకున్న వారికి పది వేల రూపాయలు, మృతులకు పది లక్షల రూపాయలు చెల్లించాలనే డిమాండ్‌ను టీడీపీ వినిపిస్తోంది. అయితే టీడీపీ వినిపిస్తున్న డిమాండ్‌ ప్రకారం పరిహారం ప్రభుత్వ గణాంకాల ప్రకారం చెల్లించాలా..? లేక టీడీపీ సేకరిస్తామంటున్న లెక్కల ప్రకారం చెల్లించాలా..?

ప్రభుత్వ పనితీరు కనిపించడంలేదా..?

కరోనా వైరస్‌పై దేశంలోనే అత్యుత్తమమైన పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పరీక్షలు, వైద్యం అన్ని ఉచితంగా అందించింది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేర్చింది. 40 పడకలు ఉన్న ప్రతి ఆస్పత్రిని కరోనా కేర్‌ సెంటర్‌గా మార్చి వైద్యం అందించింది. చికిత్స వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. దురదృష్టవశాత్తూ కరోనా వల్ల తల్లిదండ్రులు మరణిస్తే.. వారి పిల్లల భవిష్యత్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. పిల్లల పేరుపై పది లక్షల రూపాయల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసింది. చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది.

కేంద్రాన్ని ఒప్పిస్తారా..?

కరోనా వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం చెల్లించే విషయమై ప్రస్తుతం సుప్రిం కోర్టులో విచారణ జరుగుతోంది. కరోనా ప్రకృతి విపత్తే కాబట్టి పరిహారం చెల్లించాలనే పిటిషన్‌ దాఖలైంది. కరోనా నిరంతరం ఉండేది కాబట్టి.. దీని వల్ల మరణించిన వారికి పరిహారం ఇవ్వలేమని సుప్రిం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులకే పరిహారం ఇస్తామని చెబుతోంది. కరోనా మృతులకు పరిహారం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి సహకరించదని కుండబద్ధలు కొట్టింది. కేంద్రం తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం పది లక్షలు ఇవ్వాలంటున్నారు. మరి ఈ విషయంపై కేంద్రం మనుసు మారేలా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసే ప్రయత్నం చంద్రబాబు చేస్తారా..? లేక పరిహారం పేరుతో రాజకీయాలకే పరిమితం అవుతారా..? చూడాలి.