చిమ్మ చీకటి.. భోరున వర్షం.. దారంతా రాళ్ళు.. వెళ్ళాల్సింది చాలా దూరం.. వయస్సేమో సహకరించదు.. అన్నట్టుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అన్నది రాజకీయవర్గాల్లో అత్యంత బలంగా విన్పిస్తున్న మాట. రాన్రాను ఆ పార్టీ పరిస్థితి చూస్తున్న సామాన్యులకైనా ఇదే ఉద్దేశం కన్పిస్తుంది. పదవులు అనుభవించేసిన నేతలు తలోదిక్కు చూసుకున్నారు.
ఎప్పట్నుంచో జెండా పట్టుకు తిరిగిన వారికి ధైర్యం చెప్పే నాధుడు కన్పించడం లేదు. పెద్దాయన, చిన్నాయనలు జూమ్‌లు, ట్విట్టర్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. లేకపోతే తోటి ప్రతిపక్ష పార్టీలు చేసే ఏదో ఒక పోరాటానికి కూడా అక్కడ్నుంచే మద్దతు తెలిపేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి కేడర్‌లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. 23 సీట్లు గెలిచిన ఏపీలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఉనికోసం కష్టపడుతున్న తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే తెలంగాణా టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని అక్కడి సీనియర్ నేతలు చంద్రబాబుకు లేఖరాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్న ఏపీలోనే ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిని ఎదుర్కొంటుంటే.. అక్కడ తెలంగాణాలో సరిదిద్దమని ఫిర్యాదు కం సిఫార్సు రావడంతో చంద్రబాబు గతుక్కుమన్నట్లుగా ఆయన ప్రత్యర్ధులు విమర్శలకు దిగుతున్నారు. వారి విమర్శల మాటెలా ఉన్నా పరిస్థితి దాదాపు ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకు అర్ధమవుతూనే ఉంది. వారి సొంత పార్టీ కేడర్‌కైతే ఇంకాస్త లోతుగా అర్ధమై తమకు అత్యంత సమీపంలోని ఏదో ఒక పార్టీ నీడకు చేరే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లుగా వినికిడి.
అయితే జాకీలేస్తున్న వర్గ మీడియా మాత్రం తమ నాయకుడు అపరచాణక్యుడు.. సమయం కోసం వేచి చూస్తున్నాడు.. తిరిగి తప్పకుండా పైకి లేస్తాడు అంటూ మగధీర సినిమాలో శ్రీహరి మాదిరిగా నచ్చింది వండి వార్చేసుకుంటున్నారు. అయితే సదరు మీడియా వ్యవహారశైలిని గమనించిన జనం వారు చెప్పే మాటల్ని వినడం ఎప్పుడో మానేసారు. సదరు వర్గ పేపర్‌ని చూస్తే తప్ప ఉదయాన్నే ప్రకృతి పిలుపు సక్రమంగా రాని వారు అక్కడక్కడా కొందరు మిగిలిపోయారు. వారు తప్పితే వీటిని గురించి పట్టించుకుంటున్న వారు లేరన్నది మీడియా వర్గాల్లోనే బలంగా విన్పిస్తోంది.
అయితే ఇక్కడ మరో వాదన కూడా విన్పిస్తోంది. తెలంగాణాలో పార్టీని పైకెత్తడం ద్వారా బీజేపీకి దగ్గరవుదామన్న మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అక్కడ పార్టీ గురించి జనంలోకి ఈ విధమైన ప్రచారం వదులుతున్నారని, దీనికి అధ్యక్షుడి మార్పును పావుగా వాడుకుంటున్నారన్నవారు కూడా లేకపోలేదు. తెలంగాణాలో బీజేపీ పంచన చేరడం ద్వారా జాతీయస్థాయిలో ఆ పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు కూడా వ్యూహాలున్నట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు బరువు బాధ్యతలు మోసిన ఎల్ రమణను బలిపశువును చేస్తున్నట్లుగా భావిస్తున్నవారూ లేకపోలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏపీలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడ్ని మార్చేసి ఎన్టీరామారావు కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న డిమాండ్ చాపకింద నీరులా చుట్టేస్తున్నట్టు భోగట్టా. తెలంగాణాలో కెలికితే ఏపీలో కూడా ‘వారసుల’ డిమాండ్ ఉధృతమవ్వొచ్చు. దీంతో రాజకీయ చాణక్యుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి దగ్గరవ్వాలన్న స్ట్రాజీకోసమే ఇదంతా అయితే గనుక ఇక్కడ ఏపీలో ఏర్పడబోయే పరిస్థితులు ఏంటన్నది చర్చనీయాంశంగా మారుతోంది.