iDreamPost
android-app
ios-app

ప్చ్‌.. బాబు గారు.. మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ మిస్‌ చేసుకుంటున్నారు..!

ప్చ్‌.. బాబు గారు.. మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ మిస్‌ చేసుకుంటున్నారు..!

2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే గొప్ప అవకాశాన్ని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేజేతులా మిస్‌ చేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వం కక్షగట్టి అమరావతిపై దుష్ప్రచారం చేస్తోందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో కేసులు పెడుతోందని చంద్రబాబే చెబుతున్నారు. అమరావతి భూ కుంభకోణం జరగలేదని చంద్రబాబు ఢంకా భజాయించి చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సీబీఐ లేదా మరే సంస్థ చేతనైనా విచారణ జరిపించినా… చంద్రబాబుకు వచ్చే నష్టం ఏముంటుందనే మాట వినిపిస్తోంది. విచారణ జరిపి ప్రభుత్వం ఏమీ తేల్చలేకపోతే అది చంద్రబాబుకే లాభిస్తుంది కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా వైఎస్‌ జగన్‌ అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. విచారణ జరిగితే.. వైఎస్‌ జగన్‌ చేసే ఆరోపణల్లో నిజం లేదని తేలుతుంది. చంద్రబాబు, టీడీపీ నేతలు కడిగిన ముత్యంలా ప్రజలకు కనిపిస్తారు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టి.. వారి మద్ధతును కూడగట్టే ఛాన్స్‌ను విచారణలను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు మిస్‌ చేసుకుంటున్నారని తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు, అమరావతే ఏకైక రాజధానిగా నిలబెట్టేందుకు ఈ అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలని టీడీపీ అభిమానులు సూచిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు రాగానే వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ నేత శంకరరావు, టీడీపీ నేతలు అశోక్‌ గజపతిరాజు, కింజారపు ఎర్రన్నాయుడులు కేసులు వేశారు. లక్ష కోట్లు దొచారని చంద్రబాబు, లోకేష్‌ సహా టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే ఆ కేసులను, ఆరోపణలను వైఎస్‌ జగన్‌ కోర్టు ద్వారా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో పలు సందర్భాల్లో చంద్రబాబు, నారా లోకేష్‌లే చెప్పారు. ఫలితంగా 2019లో జగన్‌కు ఏపీ ప్రజలు భ్రహ్మరథం పట్టారు. ఇలాంటి అవకాశమే ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చింది.

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని వైసీపీ, లేదని టీడీపీలు వాదించుకుంటున్నాయి. అసలు నిజా నిజాలు ఏమిటో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చేయదల్చిన విచారణను చంద్రబాబు అండ్‌ కో కోర్టుల ద్వారా అడ్డుకోవడంతో.. వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. ఇది చివరికి చంద్రబాబుకు పెద్ద నష్టమే చేస్తుందనడంలో సందేహం లేదు.

Read Also; సుప్రీం కోర్టుకు వెళ్తాం – సజ్జల

అదే అమరావతిపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిగితే.. చంద్రబాబు చెబుతున్నట్లు తప్పు ఏమీ లేకపోతే 2024 ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. మరో సారి అధికారం చేపట్టేందుకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటున్నారనేదే సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. మరి బాబుగారు… సీబీఐ కాదు ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా..? లేక విచారణలను కోర్టుల ద్వారా అడ్డుకుంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిజమని ఒప్పుకుంటారా..? రెండూ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి.