Idream media
Idream media
కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ చెబుతున్న మాట. అలాగే ఏపీ ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్ అవసరం అంటూ పలు సందర్భాల్లో లేవనెత్తారు. ప్రభుత్వం వ్యాక్సిన్ ఇప్పించేందుకు శ్రద్ధ పెట్టడం లేదంటూ ఆరోపణలు కూడా కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంతకీ ఆయన వ్యాక్సిన్ వేసుకున్నారా, లేదా? వేయించుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వేయించుకున్నారా, తెలంగాణలోనా..??
సాధారణంగా అయితే ఇలాంటి ప్రశ్నలు అనవసరం. కానీ, అక్కడ చంద్రబాబు కాబట్టి, కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా 18 నుంచి 45 ఏళ్ల లోపు వ్యాక్సిన్ అందడం లేదని వాపోతున్నారు కాబట్టే ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో ఆగమాగమవుతున్నారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తున్నా, కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ లు, ఆక్సిజన్ లు సకాలంలో రాకపోవడంతో అక్కడక్కడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి విషయాలపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు తన వంతుగా కేంద్రంతో మాట్లాడింది కానీ, లేఖ రాసింది కానీ లేదు. ప్రభుత్వంపై ఆరోపణలు మాత్రం చేస్తున్నారు.
రంగుల కోసం వేలాది కోట్లు వెచ్చించిన ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం 1600 కోట్లు ఖర్చు చేయలేదా అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి కొడాలి నాని గతంలోనే కౌంటర్ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల రూపంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. అటువంటి ప్రభుత్వం ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించటానికి 1600 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుక అడుగు వేస్తారంటే ప్రజలు నమ్ముతారా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అన్నారు. ఆ అకౌంట్ నెంబర్ కు 1600 కోట్లు జమ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు.
అది అలా ఉంటే, తాజాగా మరో మంత్రి కన్న బాబు మాట్లాడుతూ వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా?. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా.. వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు?. ఏపీలోనా…లేక తెలంగాణలోనా?. భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ వేయించుకున్నారా?. కోవి షీల్డ్ వేయించుకున్నారా?. ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనేది ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
దేశంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుంది.. వ్యాక్సిన్ సరఫరా కేంద్రం చేతుల్లో ఉన్న విషయం టీడీపీ వారికి తెలిసినా మాపై విమర్శలు చేస్తున్నారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా?. కేంద్రం అనుమతి లేక గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదు. అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం అన్నదాంట్లో తప్పేముంది.. అంటూ కన్నబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నారా అని లేవనెత్తడం లాజిక్కే అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న వార్తకానీ, ఫొటోకానీ ఇప్పటి వరకూ బయటకు రాకపోవడమే ఇందుకు కారణం.