తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం, ఆ పార్టీకి జనసేన మద్ధతు తెలపడం ఖాయమైంది. శుక్రవారం బీజేపీ, జనసేన అగ్రనేతలు ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో దాదాపు మూడు నెలలుగా బీజేపీ, జనసేన పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి తిరుపతిలో పోటీ చేస్తారనే ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడింది.
అయితే ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు..? ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎవరు దక్కించుకుంటారు..? బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుంది..? వంటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. జనసేనతో చర్చించిన తర్వాతే తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందనే అంశాన్ని ఖరారు చేశామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా తెలిపారు. పార్టీ అభ్యర్థి ఎవరనేది కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుందని తెలిపారు. బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందనేది తెలియాల్సిన అంశం.
బీజేపీ తన అభ్యర్థిని రాబోయే రోజుల్లో ప్రకటించబోతున్నా.. ఇప్పటికే అభ్యర్థి ఎవరనేది నిర్ణయించారా..? ఇక ప్రకటనే తరువాయా..? అనే ప్రశ్నలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వల్ల ఉత్పన్నమవుతున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేయడం కన్నా.. తిరుపతి నగరం అభివృద్ధి ముఖ్యమని భావించామని, అందుకే బీజేపీ అభ్యర్థి పోటీకి సమ్మతించామని పవన్ తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి ఉంటే తిరుపతి స్థానాన్ని వారికే వదిలిపెడతామని ముందు నుంచి చెబుతూ వస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ వివరించారు.
పవన్ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారానే బీజేపీ అభ్యర్థి ఇప్పటికే ఖరారు అయ్యారని అర్థమవుతోంది. బీజేపీ తరఫున ఎవరు పోటీ చేసేది ఆ పార్టీ నేతలు జనసేన అధినేతకు చెప్పారు. ఆ అభ్యర్థి బలాబలాలు, అర్హతలు, శక్తి సామర్థ్యాలపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు పవన్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ బీజేపీ అభ్యర్థి ఎవరు..?
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, కర్నాటక రాష్ట మాజీ చీఫ్ సెక్రటరీ రత్నప్రభను బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లానే. 2018లో కర్ణాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన ఆమె 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.
Also Read : బీజేపీ – జనసేన.. తిరుపతిలో పోటీపై క్లారిటీ
ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో కాల్బుర్గి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే పై పోటీ చేయాల్సి ఉన్నా.. ఎన్నికలకు ముందు స్థానికంగా బలమైన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ బీజేపీలో చేరడంతో ప్రచారానికి పరిమితం అయ్యారు. బీజేపీ తరఫున రత్నప్రభ ఆ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ లోక్‌సభాపక్ష మాజీ నేత మల్లికార్జున ఖర్గే ఓడిపోయారు. అన్ని విధాలుగా బలమైన రత్నప్రభ పేరును బీజేపీ నేతలు ప్రతిపాదించడంతోనే.. ఆమెకు గెలుపొందే సత్తా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ భావించినట్లుగా అనుకోవచ్చు.