iDreamPost
android-app
ios-app

పెద్దల సభపై పట్టు బీజేపీకి కలేనా?

  • Published Jun 17, 2021 | 6:47 AM Updated Updated Jun 17, 2021 | 6:47 AM
పెద్దల సభపై పట్టు బీజేపీకి కలేనా?

వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి లోకసభలో సొంతంగానే మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో మెజారిటీ సంపాదించడం మాత్రం కలగానే మిగిలిపోతుంది. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. మెజారిటీ సాధించాలంటే 123 మంది సభ్యులు ఉండాలి. కానీ ప్రస్తుతం బీజేపీకి 93 మందే ఉన్నారు. అంటే మెజారిటీ మార్కుకు ఇంకా 30 తక్కువ. దాంతో కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీయే కూటమి పక్షాలు, బయట నుంచి మద్దతు ఇచ్చే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు బీజేపీ నాయకత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే ముందు ముందు మెజారిటీ సాధించడం మాటమోగానీ.. ఉన్న బలం తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నిక ఉన్న తరుణంలో ఈ పరిణామం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది.

వచ్చే ఏడాది 71 మంది రిటైర్మెంట్

వచ్చే ఏడాది మూడు దఫాలుగా మొత్తం 71 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. ఏప్రిల్లో 18 మంది, జూన్లో 20 మంది, జూలైలో 33 మంది పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో అత్యధికులు బీజేపీ, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలవారే. అదే సమయంలో.. అంటే జూలైలో రాష్ట్రపతి ఎన్నిక, దానికి నాలుగు నెలల ముందే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించే ఫలితాలను బట్టి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను తిరిగి దక్కించుకోవడం ఆధారాపడి ఉంటుంది. అసెంబ్లీ, రాజ్యసభ ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికపై ప్రభావం చూపుతాయి.

ఇప్పటి బలం కాపాడుకోవడం కష్టమే

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బలం పెంచుకోడం బీజేపీకి కష్టమనే భావన ఉంది. ఒకవేళ గెలిచి ఇక్కడ బలం కాపాడుకోగలిగినా..  మిగతా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న సీట్లను మళ్లీ చేజిక్కించుకోవడం కష్టం. అదెలా అంటే.. వచ్చే జూన్లో ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడింటికి ప్రస్తుతం బీజేపీ (2019లో టీడీపీ నుంచి చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టి.జి.వెంకటేష్) ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ వైఎస్సార్సీపీకి వెళ్లిపోతాయి.

రాజస్థాన్లో వచ్చే ఏడాది జూలైలో ఖాళీ అయ్యే స్థానాల్లో 4 బీజేపీవే. అక్కడి అసెంబ్లీలో కాంగ్రెస్ ఆధిక్యత ఉన్నందున మూడు ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోతాయి. చత్తీస్గఢ్ లో ఖాళీ అయ్యే ఒక్క స్థానాన్ని బీజేపీ కోల్పోతుంది. అన్నింటికంటే కీలకమైన యూపీలో ఖాళీ అయ్యే 11 స్థానాల్లో 5 బీజేపీవే. ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పార్టీలు సాధించే సీట్లను బట్టి.. రాజ్యసభ స్థానాల ఫలితం తేలుతుంది. అయితే యూపీలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వం అధికారం కాపాడుకోగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కాపాడుకున్నా.. ఇప్పుడున్నంత మెజారిటీ రాదని అంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడున్న రాజ్యసభ సీట్లను తిరిగి పొందడం కష్టమవుతుంది.

పంజాబులో ఒక స్థానం కోల్పోనుంది. అలాగే తమిళనాడులో మిత్రపక్షం అన్నాడీఎంకే ఇటీవలి ఎన్నికల్లో ఓటమి చెందడంతో.. అక్కడ ఇప్పటికే ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో రెండు డీఎంకేకు కోల్పోతుంది. వచ్చే జూన్లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో మరో రెండింటిని కూడా అన్నాడీఎంకే కోల్పోనుంది. ఆ మేరకు బీజేపీకి నష్టం వాటిల్లుతుంది. మొత్తంగా చూసుకుంటే పెద్దల సభలో మెజారిటీ సాధించలేకపోగా.. ఇప్పుడున్న సంఖ్యాబలాన్నే బీజేపీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇది రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.

Also Read : పాశ్వాన్ పార్టీలో చిచ్చుపెట్టిన బీహార్ ముఖ్యమంత్రి …?