iDreamPost
android-app
ios-app

జగన్‌ ఆశయానికి తూట్లు పడనున్నాయా..?

జగన్‌ ఆశయానికి తూట్లు పడనున్నాయా..?

మద్యం రక్కసి నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలనే మహోన్నత ఆశయంతో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యానికి తూట్లు పడనున్నాయా..? అక్రమ మద్యం రవాణా కట్టడికి నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) ముందరి కాళ్లకు బంధం పడిందా..? అంటే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని గతంలో ప్రభుత్వం జారీ చేసిన 411 జీవోను ఉదహరిస్తూ.. అలా మద్యం తీసుకురావడం నేరం కాదని హైకోర్టు తీర్పువెలువరించడం మద్యపాన నిషేధం అమలుకు గొడ్డలిపెట్టుగా మారుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తీసుకువచ్చారన్న అభియోగాలపై కరణం శ్రీనివాసులు బృందంపై ఎస్‌ఈబీ నమోదు చేసిన కేసును జీవో నంబర్‌ 411 ద్వారా తప్పుబడుతూ హైకోర్టు బుధవారం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో భాగంగా మద్యం దుకాణాలు తగ్గింపు, ప్రభుత్వమే దుకాణాల నిర్వహణ, పని వేళల కుదింపు, ధరల పెంపు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురాకుండా ఉండేలా ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు, 24 గంటలూ తనికీ.. తదితర చర్యలను జగన్‌ సర్కార్‌ తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకువస్తున్న ఘనటల్లో 33,600 కేసులను ఎస్‌ఈబీ పెట్టి, 46,250 మందిని అరెస్ట్‌ చేసింది. దాదాపు 50 వేల వాహనాలను సీజ్‌ చేసింది. ఈ విధంగా మద్యం అక్రమ రవాణాపై ఎస్‌ఈబీ ఉక్కుపాదం మోపడంతో ప్రస్తుతం అక్రమార్కులు మిన్నుకుండిపోయారు.

అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు అక్రమ మద్యం చేసే వారికి మంచి అవకాశంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీకి సరిహద్దులుగా ఒడిశా, ఛత్తీష్‌ఘడ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండడం, సరిహద్దు రాష్ట్రాల్లో తక్కువ ధరలు ఉండడంతో అక్కడ మద్యం ఇక్కడకు తెచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది కొంత మందికి వ్యాపారంగా మారింది. ప్రస్తుత హైకోర్టు తీర్పుతో అక్రమార్కులు ఇకపై అదే పనిలో ఉండే అవకాశం ఉందన్న అనుమానాలున్నాయి. మూడు బాటిళ్లు చొప్పున రాష్ట్ర సరిహద్దులో ఉండే దుకాణాల నుంచి తెచ్చుకుని స్థానికంగా విక్రయించే అవకాశం ఉంది. ఫలితంగా బెల్ట్‌ దుకాణాలు మళ్లీ పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే ప్రమాదం ఉంది. ఓ పక్క ఎస్‌ఈబీ.. మూడు బాటిళ్లను తెచ్చే వారిని అడ్డుకోని పరిస్థితి, మరో పక్క రాష్ట్రంలో పెరిగే బెల్ట్‌ దుకాణాల వల్ల మొత్తంగా.. జగన్‌ సర్కార్‌ తలపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధ లక్ష్యానికే పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనేది వేచి చూడాలి.