Idream media
Idream media
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో టెలిమెడిసిన్, మందుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలలో అభియోగాలు ఎదుర్కొంటూ అనారోగ్య కారణాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జుడీషియల్ ఖైదీగా ఉంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంది. 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన ఈ స్కాంలో అచ్చెం నాయుడుతో సహా ఈఎస్‌ఐ మాజీ, తాజా అధికారులు నిందితులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెం నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
అచ్చెం నాయుడు బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరగ్గా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సిదార్థ లూద్రా వాదనలు వినిపించారు. అచ్చెం నాయుడును అరెస్ట్ చేసి 45 రోజులు దాటిందని, ఈ కేసులు ఏసీబీ సాక్షుల వాగ్మూలాలు కూడా తీసుకుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే ఏసీబీతరఫు వాదనలు వినిపించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్.. ఏసీబీ విచారణ ఇంకా కొనసాగుతోందని, బెయిల్ ఇవ్వొద్దంటూ విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు. ఈ వారంలో తీర్పు వస్తుందనే ప్రచారం సాగుతుంది.
పక్కా ఆధారాలతో ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెం నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి 45 రోజులు అవుతున్నా.. ఆయన జైలులో నాలుగు రోజులుకూడా ఉండలేదు. మొలలు ఆపరేషన్ జరిగిందన్న కారణంతో ఆదిలోనే ఏసీబీ న్యాయస్థానం అచ్చెం నాయుడును జుడిషియల్ రిమాండ్‌లో ఉంచుతూ గుంటూరు జీజీహెచ్‌లో వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.దాదాపు 18 రోజుల తర్వాత ఈ నెల 1వ తేదీన జీజీహెచ్ వైద్యులు అచ్చెం నాయుడును డిశ్చార్జి చేశారు.
అయితే తనకు ఆరోగ్యం కుదుటపడలేదని, కడుపులో అల్సర్ పెరిగిందని పేర్కొంటూ తనను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం అచ్చెం నాయుడుకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఈ నెల 8వ తేదీన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అచ్చెం నాయుడు జుడిషియల్ రిమాండ్‌లోనే కొనసాగుతారా..? లేదా.. బెయిల్‌పై విడుదలవుతారా..? రెండుమూడు రోజుల్లో తేలనుంది.