iDreamPost
android-app
ios-app

నాణ్యమైన విద్యుత్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

నాణ్యమైన విద్యుత్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

నాణ్యమైన ధాన్యం, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుమందులు, నాణ్యమైన బియ్యం, నాణ్యమైన కూరగాయలు, నాణ్యమైన ఉప్పు, నాణ్యమైన పప్పు, నాణ్యమైన వస్త్రం, నాణ్యమైన బంగారం, నాణ్యమైన వస్తువులు.. ఇవన్నీ మన జీవితంలో నిత్యం చూసేవే. ఆయా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను చూసి లేదా తాకి కొనుగోలు చేస్తాం. వాటి నాణ్యతను తెలుసుకునేందుకు నిర్థిష్టమైన ప్రమాణాలు, కొలతలు ఉన్నాయి.

మరి నాణ్యమైన విద్యుత్‌ గురుంచి ఎప్పుడైనా విన్నారా..? అది ఎలా ఉంటుందో చూశారా..? అసలు నాణ్యత లేని విద్యుత్‌ను మీరు ఎప్పుడైనా వాడుకున్నారా..? విద్యుత్‌ నాణ్యమైనదో కాదో ఎలా తెలుసుకోగలమో మీకు తెలుసా..?

ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే.. ఒకప్పటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ వద్దకు వెళ్లాల్సిందే. ఈ రోజు వరకూ విద్యుత్‌లో నాణ్యమైనది, నాణ్యత లేనిది అంటూ ఉంటుందని సామాన్య ప్రజలకు తెలియదు. కానీ బీరు హెల్త్‌ డ్రింక్‌ అంటూ ప్రమోట్‌ చేసిన మాజీ మంత్రి జవహర్‌.. ప్రజలకు సరికొత్త సందేహాలు వచ్చేలా.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లేదని ఈ రోజు ఓ ఛానెల్‌ డిబేట్‌లో విమర్శించారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫీజులు పోయినప్పుడు.. లేదా ఓవర్‌ లోడు అయినప్పుడు లో హోల్టేజ్‌ సమస్య వస్తుంది. కానీ నాణ్యమైన విద్యుత్, నాణ్యత లేని విద్యుత్‌ అంటే జవహర్‌ లాంటి మేథావులకు తెలుసేమో గానీ సామాన్య ప్రజలకు తెలియదు. ఈ అంశంపై సందేహాలు వచ్చిన వారు, నాణ్యమైన విద్యుత్‌ గురించి తెలుసుకోవాలనే కుతూహలం గలవారు ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో జవహర్‌ వద్దకు వెళ్లలేరు. పైగా అందరూ ఫోన్‌ చేసి తెలుసుకోలేరు.

అన్ని వస్తువుల్లాగా చూసి తెలుసుకుందామంటే నిత్యం చూసేదే కానీ నాణ్యత తెలియడం లేదు. తాకి చూద్దామా అంటే షాక్‌ కొట్టి ప్రాణాలు పోతాయోమోనని భయం. సరే.. విద్యుత్‌ నిల్వ ఉన్న చోటకు వెళ్లి చూద్దామా అంటే.. ఉత్పత్తి చేసే జెన్‌కో, ఇతర ప్రైవేటు సంస్థలు, సరఫరా చేసే ట్రాన్స్‌కో సంస్థ, పంపిణీ చేసే డిస్కంలు.. విద్యుత్‌ను నిల్వ చేయలేవు.

అందుకే జవహర్‌ గారు.. నాణ్యమైన విద్యుత్‌ ఎలా ఉంటుంది..? నాణ్యత లేని విద్యుత్‌ ఎలా ఉంటుందో ఏదో ఒక ఛానెల్‌ లేదా సోషల్‌ మీడియా ద్వారానైనా.. తన ఉపాధ్యాయ అనుభవాన్ని ఉపయోగించి తెలియజేసి.. ప్రజలకు కొత్త విషయం తెలుసుకున్నామన్న అనుభూతిని పంచితే మాజీ మంత్రి, ప్రజాప్రతినిధినన్న పేరుకు సార్థకం చేసుకున్నవారు అవుతారు.