iDreamPost
android-app
ios-app

షాకింగ్ : యూఎస్‌ ఓపెన్‌ నుండి జకోవిచ్ బహిష్కరణ

షాకింగ్ : యూఎస్‌ ఓపెన్‌ నుండి జకోవిచ్ బహిష్కరణ

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌పై టోర్నీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో జకోవిచ్ కు18వ గ్రాండ్‌ స్లామ్‌ ఆశలకు గండి పడింది.

వివరాల్లోకి వెళితే యూఎస్ ఓపెన్ నాలుగవ రౌండ్లో స్పెయిన్ కు చెందిన పాబ్లో కారెనో బస్టాతో జరిగిన మ్యాచ్ లో మొదటి సెట్లో 4-5, 0-40 వెనుకబడటంతో జకోవిచ్ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో కోపంతో ఒక బంతిని విసిరాడు. జకోవిచ్ కోపంతో విసిరిన బంతి లైన్‌ అంపైర్‌ గొంతు సమీపంలో తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌ స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ జకోవిచ్‌తో 12 నిమిషాలపాటు మంతనాలు జరిపారు.

ఈ పన్నెండు నిమిషాలు జకోవిచ్ టోర్నీ రెఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌ స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీలను ప్రాధేయపడుతూ కనిపించాడు. ఎంతగా ప్రాధేయపడినా నిబంధనలకు విరుద్ధంగా బంతిని విసరడంతో జకోవిచ్ ను టోర్నీ నుండి బహిష్కరిస్తున్నట్లు ఫ్రీమెల్‌ ప్రకటించాడు. దీంతో జకోవిచ్ 18వ గ్రాండ్‌స్లామ్‌ ఆశలకు గండి పడినట్లయింది..అంతేకాకుండా టోర్నీలో జకోవిచ్‌ సాధించిన ర్యాంకింగ్‌ పాయింట్లతో పాటు 250,000 నగదు ప్రోత్సహకాన్ని కూడా కోల్పోనున్నాడు. టెన్నిస్ కోర్టులో ఆటగాడు కావాలని ప్రమాదకరంగా బంతిని విసరడం ఆట నిబంధనలకు విరుద్ధం కాబట్టి టోర్నీ నుండి బహిష్కరించినట్లు రిఫరీ తెలిపారు.

యూఎస్ ఓపెన్ టోర్నీలో జకోవిచ్ విజయం సాధిస్తాడని అందరూ అనుకున్నారు. దిగ్గజ ఆటగాళ్లయిన ఫెదరర్ మరియు రఫెల్ నాదల్ ఈ టోర్నీలో పాల్గొనక పోవడం కూడా అందుకు కారణం. దాంతో టోర్నీలో జకోవిచ్ కి సరైన ప్రత్యర్థి ఎవరూ లేరని టోర్నీలో విజయం తప్పకుండా సాధిస్తాడని జకోవిచ్ అభిమానులతో పాటు క్రీడాభిమానులు కూడా ఊహించారు. కాగా తీవ్ర అసహనానికి గురైన జకోవిచ్ అనూహ్యంగా టోర్నీ నుండి బహిష్కారణకు గురవ్వడంతో అభిమానులకు ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పవచ్చు.