iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ తర్వాత డైరెక్ట్ ఓటిటి రిలీజులు ఏ స్థాయిలో పండగ చేసుకున్నాయో చూశాం. అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా అని భాషల్లోనూ వీటి తాకిడి జోరుగా సాగింది. వి, నిశ్శబ్దం, కలర్ ఫోటో, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి థియేట్రికల్ సినిమాలన్నీ చిన్ని తెరపై వచ్చి సందడి చేశాయి. వీటి జయాపజయాల సంగతి పక్కనపెడితే జనం ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసిన మాట వాస్తవం. అయితే ఈ ధోరణి కొందరు హీరోలకు ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. నిజానికి ఈ డిజిటల్ విడుదలలో వీళ్ళ ప్రమేయం తక్కువగా ఉంటుంది. నిర్మాతల నిర్ణయాలే ఫైనల్ గా నిలుస్తాయి. అయినా కూడా జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది.
త్వరలో టాలీవుడ్ లో అల్లు అర్జున్ పుష్ప ద్వారా తెరంగేట్రం చేయబోతున్న మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు ఇదే చిక్కు సమస్యగా మారింది. ఇప్పటిదాకా ఇతనివి మూడు సినిమాలు డైరెక్ట్ గా ఆన్ లైన్ లో స్ట్రీమ్ అయ్యాయి. గత ఏడాది ప్రైమ్ లో ‘సియూ సూన్’ రాగా, ఇదే ఏప్రిల్ లో కేవలం ఒక వారం వ్యవధిలో ‘ఇరుళ్’ నెట్ ఫ్లిక్స్ లో, ‘జోజి’ అమెజాన్ ప్రైమ్ లో వచ్చాయి. అన్నింటికి మంచి స్పందన వచ్చింది. రివ్యూలు కూడా దాదాపు పాజిటివ్ గానే వచ్చాయి. ఇదే ఫిలిం బాడీ ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ అఫ్ కేరళ(FEUOK)కు ఆగ్రహం తెప్పించింది. ఒకవేళ ఇలాగే కొనసాగితే ఇకపై మీ సినిమాను థియేటర్లలో రానివ్వమంటూ ఫహద్ కు అల్టిమేటమ్ ఇచ్చేశాయి.
అతి త్వరలో ఫహద్ నటించిన భారీ సినిమా ‘మాలిక్’ విడుదలకు రెడీ అవుతోంది. దీని బిజినెస్ జరుగుతున్న తరుణంలోనే పంపిణీదారులు ఈ డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. ఇలా వరసబెట్టి ఓటిటిలో వచ్చే పనైతే తమతో ఏం పనని వాళ్ళ వాదన. దీంతో జరగబోయే డ్యామేజ్ వెంటనే ఫాహద్ కు తెలిసినప్పటికీ అతను ఇంకా స్పందించలేదు. పెట్టుబడి పెట్టే నిర్మాతలను అడగకుండా నన్ను నిలదీస్తే ఏమొస్తుందని అంటున్నట్టు సమాచారం. మాలిక్ కు అడ్డుకట్ట వేసేందుకు మాత్రం రంగం సిద్ధమయ్యిందట, రంజాన్ పండగ సీజన్ లో దీన్ని ప్లాన్ చేశారట. మొత్తానికి పుష్ప విలన్ కు పెద్ద సమస్యే వచ్చి పడింది.