iDreamPost
iDreamPost
సత్యహరిశ్చంద్ర నాటకంలో ఒకటవ హరిశ్చంద్రుడు… రెండవ హరిశ్చంద్రుడు… మూడవ హరిశ్చంద్రుడు.. అనే పాత్రలు తెరమీద వచ్చి నటించి వెళ్లేవారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్‌చార్జి పేర్లు కూడా ఇలా తెరమీదకు వచ్చి అలా కనుమరుగవుతున్నాయి. కాని రెండున్నరేళ్లుగా ఇన్‌చార్జి నియామకం మాత్రం జరగడం లేదు. ఇదే సమయంలో పార్టీ క్యాడర్ రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ రెండు, మూడు వర్గాలుగా చీలిపోయి వీధిన పడుతున్నాయి.
అమరావతి రైతుల యాత్రకు మద్దతుగా టీడీపీ పి.గన్నవరం నియోజకవర్గంలో ఇటీవల యాత్ర నిర్వహించింది. యాత్ర ఎలా ఉన్నా… చిన్న ఫ్లెక్స్ కోసం పార్టీలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకరిని ఒకరు దుర్భాషలాడుకుని, నెట్టుకున్నారు. నడిరోడ్డు మీద పార్టీ నాయకులు కొట్టుకునేంత వరకు వెళ్లడం క్యాడర్ జీర్ణించుకులేకపోతోంది. పార్టీలో జిల్లా, రాష్ట్రస్థాయి పదవులున్న ఇరువురు నాయకుల ఆధ్వర్యంలో ఈ రచ్చ చోటు చేసుకుంది.
పి.గన్నవరం పార్టీ నాయకుడు పడాల సూపర్, మాజీ ఎంపీపీ సంసాని పెద్దిరాజు వర్గాలు బాహాబాహీకి దిగారు. సూపర్ వెనుక పార్టీ ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న మందపాటి కిరణ్‌కుమార్, పెద్దిరాజు వెనుక పి.గన్నవరానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు డొక్కా నాధ్‌బాబులు ఉన్నారు. వీరిద్దరి వల్ల పి.గన్నవరంలో పార్టీ రెండుగా చీలిపోయింది. పి.గన్నవరం మండలంలోనే కాకుండా అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు మండలాల్లో కూడా పార్టీ రెండు,మూడు వర్గాలుగా చీలిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎంతోకొంత గౌరవప్రదమైన విజయాలు సాధించింది ఇక్కడే. అయినా క్యాడర్ చీలిపోవడానికి పార్టీకి ఇన్‌చార్జి లేకపోవడం కారణమనే అభిప్రాయం క్యాడర్‌లో నెలకొంది.
సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణమూర్తికి 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ నిరాకరించింది. అతనిని కాదని నేలపూడి స్టాలిన్ బాబును అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. టీడీపీకి బలమైన నియోజకవర్గం అయినప్పటికీి ప్రజా వ్యతిరేకతకు తోడు అభ్యర్థికి అనుభవం లేకపోవడంతో ఓటమి చెందింది. అలాగే పార్టీలో సీనియర్లుగా చక్రం తిప్పే ఐదుగురు ‘బాబు’లు పేరుగలవారి పెత్తనం కూడా దెబ్బతీసింది. ఎన్నికల కోసం పంపిన సొమ్ములు పక్కదారి పట్టించారు.రెండు కోట్లకు లెక్క లేకుండా పోయింది.
నాటి నుంచి పార్టీకి ఇక్కడ ఇన్‌చార్జి లేకుండా పోయారు. తమ నియోజకవర్గానికి ఇన్‌చార్జి కావాలని క్యాడర్ స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబును, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కోరినా ప్రయోజనం లేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను అమలాపురం పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి గంటి హరీష్ బాలయోగి మోస్తున్నారు. ఆయన చిన్నవాడు కావడం, పార్టీ పెద్దల నుంచి సహకారం లేకపోవడంతో పి.గన్నవరం వర్గవిభేదాలను అదుపులో పెట్టలేకపోతున్నారు. తొలుత ఇక్కడ పార్టీ ఇన్‌చార్జ్ పదవి కావాలని పార్టీకి చెందిన గేదెల వరలక్ష్మి అడిగారు. ఆమె గతంలో అమలాపురం పార్లమెంట్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు.
అయితే అధిష్టానం పట్టించుకోలేదు. తరువాత ముమ్మిడివరానికి చెందిన ఆనంద్‌సాగర్ పేరు బలంగా తెరమీదకు వచ్చింది. స్థానికేతరుడు అని క్యాడర్ వ్యతిరేకించింది. వలస నాయకులు అవసరం లేదని తేల్చిచెప్పారు. తరువాత కాకినాడకు చెందిన ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ యజమాని పేరు వినిపించినప్పటికీ ఎందుకోగాని తరువాత తెర మరుగయ్యింది. ఆయన స్థానంలో మందపాటి కిరణ్‌కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే ఆయనే వర్గాలు కడుతుండడంతో క్యాడర్ మక్కువ చూపడం లేదు. చివరికు చిన్నచిన్న పదవుల్లో ఉన్నవారి పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి కాని ఇన్‌చార్జి నియామకం మాత్రం జరగడంలేదు. దీనితో క్యాడర్ నీరుగారిపోతోంది.