iDreamPost
android-app
ios-app

బుల్లితెర ‘భీష్మ’కు ఊహించని పరాభవం

  • Published Nov 05, 2020 | 8:27 AM Updated Updated Nov 05, 2020 | 8:27 AM
బుల్లితెర ‘భీష్మ’కు ఊహించని పరాభవం

ఒకప్పుడు థియేటర్ తర్వాత ఒక సినిమాకు ప్రసార మాధ్యమం కేవలం శాటిలైట్ అదే బుల్లితెర మాత్రమే ఉండేది. ఇప్పుడు మధ్యలో ఓటిటి వచ్చి చేరి ఎంత రచ్చ చేస్తోందో చూస్తూనే ఉన్నాం. దీని ప్రభావం ఎంత లేదనుకున్నా చాలా తీవ్రంగా పడుతున్న మాట వాస్తవం. ఛానళ్ళు వరల్డ్ ప్రీమియర్లు టెలికాస్ట్ చేయడంలో చూపిస్తున్న అతి అలసత్వం రేటింగ్స్ కి ఎసరుపెడుతోంది. మొన్న ప్రభాస్ సాహో దారుణంగా గుణ 369 కంటే తక్కువ రెస్పాన్స్ తో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా భీష్మ కూడా అదే కోవలోకి చేరిపోయింది. అంచనాలకు భిన్నంగా తక్కువ రేటింగ్ తో అందరూ విస్తుపోయేలా చేసింది.

తాజా సమాచారం మేరకు భీష్మకు కేవలం 6.65 టిఆర్పి వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది లాక్ డౌన్ ముందువరకు వచ్చిన అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో భీష్మది మూడో స్థానం. నితిన్ కెరీర్ లోనే అధిక వసూళ్లు సాధించింది. పక్కా ఎంటర్ టైన్మెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వెంకీ కుడుముల ఇచ్చిన ట్రీట్ మెంట్ కమర్షియల్ గానూ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అదే తరహాలో టీవీలో వచ్చినప్పుడు కూడా అదే స్థాయి స్పందన ఆశించారు అభిమానులు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న భీష్మను మొదటిసారి జెమిని టీవీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అదే సమయంలో సమంత హోస్ట్ చేసిన బిగ్ బాస్ 4 స్పెషల్ ఎపిసోడ్ కూడా స్టార్ మాలో వచ్చింది.

కానీ ఇప్పుడిలా జరగడం ఆశ్చర్యమే. అయితే భీష్మ ఇప్పుడంటే టీవీలో వచ్చింది కానీ సన్ నెక్స్ట్ యాప్ లో ఎప్పుడో స్ట్రీమింగ్ చేశారు. ఆన్ లైన్ లోనూ వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది. లోకల్ ఛానల్స్ సైతం పలుమార్లు రుద్దేశారు. అలాంటప్పుడు విడుదలైన ఏడు నెలలకు వేస్తే ఆసక్తి ఎలా ఉంటుంది. కానీ ఈ ట్రెండ్ కు ఎదురీది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో 20+ సెన్సేషనల్ రేటింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. మరీ ఆ స్థాయిలో కాకపోయినా భీష్మ కనీసం 15 అయినా తెచ్చుకుంటుందేమో అనుకుంటే కనీసం సగం కూడా రాలేదు. దీన్ని బట్టి చూస్తే శాటిలైట్ సినిమాలు మున్ముందు ఇంకా కఠినమైన సవాళ్లు ఎదురుకోవాల్సి వచ్చేలా ఉంది. ఇంతకన్నా ఉదాహరణలు వేరే కావాలా.