టాలీవుడ్లో అర్జున్ రెడ్డి రూపంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకునేలా చేసిన సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత ఇంకో సినిమా చేయనే లేదు. దీన్నే హిందీ రీమేక్ గా కబీర్ సింగ్ రూపంలో మూడు కోట్ల ఇండస్ట్రీ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు కానీ వేరే కొత్త కథతో అయితే ప్రేక్షకుల ముందుకు రాలేదు. మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో గట్టి ప్రచారమే జరిగింది కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దాన్ని పెండింగ్ లో ఉంచినట్టు తెలిసింది. అయితే సందీప్ అడుగులు మాత్రం బాలీవుడ్ వైపే వెళ్తున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా హిందీలో ఓ భారీ సినిమాకు ప్లానింగ్ జరుగుతోందని ముంబై టాక్.
దీనికి గాను ‘డెవిల్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. కబీర్ సింగ్ నిర్మించిన మురద్ ఖేతాని దీనికి ప్రొడ్యూసర్ గా వ్యవహించబోతున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో రన్బీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికీ ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి వాటితో పోలిక రాకుండా సందీప్ చాలా డిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నాడట.
అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో లాక్ డౌన్ అయ్యాక రాబోతోంది. ఈ లోగా సందీప్ ఫైనల్ స్క్రిప్ట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని లాక్ చేయబోతున్నారు.
దీన్నే తెలుగులో ఇంకో హీరోతో తీస్తారా లేదా అనే క్లారిటీ అయితే లేదు. అర్జున్ రెడ్డితో తన టేకింగ్ లోని మేజిక్ ని రుచి చూపించిన సందీప్ వంగా మరోసారి ఎప్పుడెప్పుడు ఇంకో సినిమా రూపంలో దాన్ని అందిస్తారా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కాకపోతే డెవిల్ నేషనల్ సినిమా కాబట్టి ఇక్కడా చూసే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. డెవిల్ కి సంబంధించిన బడ్జెట్ తదితర అంశాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం మేరకు 150 కోట్లకు పైగా కేటాయించినట్టు వినికిడి. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తరహాలో సందీప్ వంగా చాలా త్వరగా ముంబైలో సెటిలయ్యేలా ఉన్నాడు.