iDreamPost
android-app
ios-app

స్వర్గానికేగిన నటదిగ్గజం దిలీప్ కుమార్

  • Published Jul 07, 2021 | 3:36 AM Updated Updated Jul 07, 2021 | 3:36 AM
స్వర్గానికేగిన నటదిగ్గజం దిలీప్ కుమార్

ఒక శకం ముగిసింది. భారతీయ సినిమా చరిత్ర దేదీపమాన్యంగా వెలిగిపోవడానికి ఒక ప్రమిదలా నిత్యం నటననే ఊపిరిగా పీల్చుకున్న ఒక కిరణం స్వర్గానికేగింది. దిలీప్ కుమార్(98) ఈ రోజు ఉదయం 7.30లకు ముంబై హిందుజా ఆసుపత్రిలో తుదిశ్వాస తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతూ కాలచక్రంతో పోటీ పడుతున్న దిలీప్ సాహెబ్ ఇవాళ విధికి తల వంచక తప్పలేదు. విలన్లను అవలీలగా మట్టి కురిపించిన ఈ దిగ్గజం జబ్బులను సైతం అంతకంటే గొప్ప స్ఫూర్తితో పోరాడారు. తనను కృంగదీసిన ప్రతిసారి అంతకు రెట్టించిన ఉత్సాహంతో వాటిని ఎదురుకునే వారు. శత వసంతాల వయసుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్న దిలీప్ కుమార్ ఇలా వదిలివెళ్లిపోవడం విషాదం.

దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 22న పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. వీళ్ళ కుటుంబానికి పళ్ళ వ్యాపారం. మొదటిసారి తెరపై కనిపించిన చిత్రం 1944లో విడుదలైన జ్వర్ భాతా. అక్కడ మొదలైన ప్రస్థానం దశాబ్దాల తరబడి కొనసాగి ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్రవేసింది. అందాజ్, ఆన్, దాగ్, దేవదాస్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, నయా దౌర్ తదితర సినిమాల్లో దిలీప్ అసమాన నటనకు ఫిదా కానీ వారు లేరు. మొఘల్ ఏ ఆజంలో దిలీప్ నటన కోసమే దాన్ని వందల సార్లు చూసిన అభిమానులు ఉన్నారు. 1976లో ఐదేళ్ల పాటు విరామం తీసుకున్న దిలీప్ కుమార్ తిరిగి 1981తో క్రాంతి లాంటి బ్లాక్ బస్టర్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ముదిమి వయసులోనూ సెకండ్ ఇన్నింగ్స్ ని గొప్పగా కొనసాగించారు.

అమితాబ్ బచ్చన్ లాంటి యంగ్ జెనరేషన్ స్టార్ హీరోతో చేసిన శక్తి(1981) ఇప్పటికీ ఒక క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. మషాల్, కర్మ, సౌదాగర్, విధాత లాంటి చిత్రాల్లో వయసు మళ్ళిన క్యారెక్టర్లు వేసినా వాటి ఘన విజయంలో దిలీప్ కుమార్ పాత్రే చాలా ఎక్కువ. 1998లో వచ్చిన ఖిలా ఆయన ఆఖరి సినిమా. ఆరోగ్య కారణాల వల్ల తర్వాత మళ్ళీ నటించలేకపోయారు. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు సైతం దిలీప్ కుమార్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. తొలినాటి అందాల తార మధుబాలతో దిలీప్ కుమార్ ప్రేమకథ కొనసాగించినప్పటికీ అది వివాహంగా మారలేకపోయింది. 1966లో ఆయన సైరా బానుని వివాహమాడారు. దిలీప్ కుమార్ తండ్రి లాలా గులామ్ సర్వర్ ఖాన్ కు 12 మంది సంతానం. 1940లో వీళ్ళ కుటుంబం పాక్ నుంచి పూణేకు వచ్చేసింది.

దిలీప్ కుమార్ ని తొలినాళ్ళలో ప్రభావితం చేసిన నటుల్లో అశోక్ కుమార్ ఒకరు. తనకు అండగా నిలిచిన నటి దేవిక రాణి సలహా మేరకు దిలీప్ కుమార్ గా తన పేరు మార్చుకున్నారు ఖాన్ సాబ్. మొదటి సినిమాలోనే ఈ పేరుతో ఎంట్రీ ఇచ్చారు. 1950లో ఈయన కెరీర్ దేదీప్యమనంగా వెలిగిపోయింది. బాబుల్, హల్చల్, దీదార్, యాహుతి, మధుమతి, పైగామ్ లాంటి ఆణిముత్యాలెన్నో తన కీర్తి శిఖరంలో చేర్చుకున్నారు. ఫిలిం ఫేర్ పురస్కారాన్ని మొదట దక్కించుకున్న ఘనత కూడా దిలీప్ కుమార్ కే దక్కింది. 70 ఏళ్ళ క్రితం 1 లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ గా దిలీప్ రికార్డు ఇప్పటికీ ప్రత్యేకమే. వందల సినిమాలు చేయకపోయినా దిలీప్ కుమార్ వదిలివెళ్లిన జ్ఞాపకాలు, చేసిన సినిమాలు ఆయనను జనహృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే నిలబెడతాయి.