iDreamPost
iDreamPost
రెండు రోజుల క్రితం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ రూపంలో విడుదలైన సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆఖరి చిత్రం దిల్ బేచారా అంచనాలకు మించి అద్భుతాలు చేసింది. 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో 75 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త బెంచ్ మార్కు వైపు పరుగులు పెడుతోంది. ఇది ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం సుశాంత్ పట్ల పబ్లిక్ లో ఉన్న సానుభూతి. చిన్న వయసులో ఇంకా కెరీర్ చాలా ఉండగానే అర్దాంతరంగా కన్నుమూయడం పట్ల ఇప్పటికీ అభిమానులు కన్నీళ్ళు పెడుతూనే ఉన్నారు. దానికి తోడు అతనికి నివాళిగా డిస్నీ హాట్ స్టార్ చందాదారులతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇవ్వడంతో వ్యూస్ పోటెత్తాయి. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ రోజో రేపో 100 మిలియన్ల మార్కు సులభంగా చేరుకుంటుంది. ఇప్పటిదాకా స్ట్రీమింగ్ హిస్టరీలో ఒక్కరోజులో నమోదైన వ్యూస్ ప్రకారం చూసుకుంటే ఇది సరికొత్త రికార్డు. ఓటిటి ఏ స్థాయిలో జనానికి కనెక్ట్ అవుతుందో చెప్పడానికి ఈ దిల్ బేచారా మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ముఖేష్ ఛాబ్రా డెబ్యూ మూవీగా రూపొందిన దిల్ బేచారా ఎమోషనల్ గా హీరో పాత్రకు సాడ్ ఎండింగ్ ఇవ్వడం సినిమా చూసిన వాళ్ళతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి సుశాంత్ పాత్రకు సంబంధించిన హార్ట్ టచింగ్ ఎపిసోడ్స్ అప్పటిదాకా దిల్ బేచారా మీద కలిగిన అభిప్రాయాన్ని సమూలంగా మార్చేశాయి. ఒకవేళ సుశాంత్ మనల్ని వదిలి వెళ్లకుండా ఉండి ఈ సినిమా మాములుగా విడుదలయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ స్థాయి స్పందన దక్కేది కాదన్న మాట వాస్తవం.
మరోవైపు ఐఎండిబిలో కూడా దిల్ బేచారా టెన్ రేటింగ్ తెచ్చుకోవడం సుశాంత్ మీద ప్రేక్షకుల మీదున్న ప్రేమకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంకా మూడు రోజులే అయ్యింది కాబట్టి రానున్న వారాల్లో ఇది ఎక్కడిదాకైనా వెళ్లే ఛాన్స్ ఉంది. శాటిలైట్ కూడా ఇదే స్థాయి స్పందనని ఆశిస్తోంది టీమ్. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇకపై ఏ రూపంలోనూ సరికొత్తగా సుశాంత్ సింగ్ ని మళ్ళీ తెరపై చూడలేమన్న వాస్తవమే హృదయాలను పిండేస్తోంది. తామెంతో అభిమానించే నటుడుకి ఫ్యాన్స్ ఈ రూపంలో ఘన నివాళి అందించారు.మరోవైపు దిల్ బేచారాని తెలుగు, తమిళ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ అనువదించి అందరికి చేరువ చేయాలనే ప్రణాళికలో హాట్ స్టార్ ఉన్నట్టు సమాచారం. అప్పుడు ఇంకా భారీ స్పందనకు ఆశించవచ్చు. దిల్ బేచారాలో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తో పాటు హీరోయిన్ సంజనా సంఘ్వి, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు సైతం మంచి పేరు వచ్చింది.