iDreamPost
android-app
ios-app

సమాజం హత్యలు చేయకూడదు.. ఆత్మహత్యలు ప్రోత్సహించకూడదు..

సమాజం హత్యలు చేయకూడదు.. ఆత్మహత్యలు ప్రోత్సహించకూడదు..

ఏరా మా ఇంట్లో చెత్తని తీసుకెళ్లడానికి రావడం లేదేంటి? బలిసిందా? బహుళ అంతస్తులో ఉంటున్న గురివిందరావు గద్ధింపు లాంటి స్వరంతో  చెత్త తీసుకెళ్లే మునిసిపాలిటీ ఉద్యోగికి మందలింపు..

రేయ్ వాచ్ మెన్ ఇల్లు జాగ్రత్త.. రావడానికి రెండు రోజులు పడుతుంది. 60 ఏళ్ల పెద్దాయనకి ఇంటి యజమాని ఇచ్చిన వార్నింగ్..

హోటల్ కి వచ్చి అరగంట అయ్యింది.. ఎక్కడ చచ్చాడో ఈ సర్వర్ గాడు.. ఒరేయ్ ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులను పట్టించుకునే పని లేదా?

ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మన దేశంలో ఏదొక సందర్భంలో కనిపిస్తూనే ఉంటాయి..

భారత దేశంలో చేసే పనిని బట్టి మనిషికి విలువ ఇవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం పని చేస్తేనే విలువ. అది ఎలాంటి పనైనా ఆ పనిని చేసే వ్యక్తిని గౌరవిస్తారు. కానీ మన దేశంలో మాత్రం చేసే పనిని చూసి మనిషికి విలువ ఇస్తారు. ఉదాహరణకు, డెలివరీ బాయ్స్ ని కానీ, హోటల్స్ లో పనిచేసే సర్వర్లను కానీ, వీధులు శుభ్రం చేసే మునిసిపాలిటీ ఉద్యోగులను కానీ, వారు చేసే పనిని బట్టి ఏదొక సందర్భంలో వివక్షకు గురి అవుతూ ఉంటారు..

ఏరా… ఒరేయ్… అని చిన్న చిన్న పనులను చేసుకునే వ్యక్తులను పిలిచిన అదే నోటితో  ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వారిని మాత్రం అయ్యా, బాబు, దొర, సారు, అయ్యగారు అని పిలిస్తూ ఉద్యోగ స్థాయిని చూసి లేని గౌరవం ఇస్తున్నారు.. అంటే చేసే పనిని బట్టి పిలుపన్న మాట..

ఇలా వివక్షకు గురైన కొందరు ఒత్తిడి తట్టుకోలేకనో సమాజం చిన్న చూపు చూస్తుందన్న బాధతోనో బలవంతంగా ప్రాణాలు తీసుకుని, సమాజం చేతిలో హత్యకు గురి అవుతున్నారు.. అంటే ఇలా పిలిచినందుకే చచ్చిపోవాలా.. ఇంత చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవాలా ? అనే అనుమానం అనేకమందిలో రావొచ్చు. కానీ… చేసే పనిని బట్టి ప్రతీ సందర్భంలో రాబందుల్లా పొడుచుకు తింటున్న ఈ సమాజం పెట్టే బాధ పడలేక, సూటిపోటి మాటలు తట్టుకోలేక ఏమాత్రం గౌరవం దక్కడం లేదన్న బాధతో తనువు చాలిస్తున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి..

కొందరు వ్యక్తులు చిన్ననాటినుండి చేసే వృత్తిని బట్టి సమాజం చేతిలో వివక్షకు గురి అయ్యి రాటుదేలిపోయి ఉంటారు.. కానీ అందరూ అలా వుండరు..కొందరు సున్నిత మనస్కులు కూడా ఉంటారు.. ఇటీవలే జరిగిన ఒక సంఘటనను గమనిస్తే ఆ విషయం అర్థం చేసుకోవచ్చు.. ఉన్నత విద్య చదివిన ఒక యువకుడు తమ కుటుంబం నిర్వహించే హోటల్ లో,కస్టమర్ల నుండి గౌరవం లభించడం లేదని ఆత్మహత్య చేసుకోవడం విచారకరం..

లోతుగా గమనిస్తే సమాజంలో చిన్న చిన్న పనులు చేసుకునేవారిపట్ల ఉన్న వివక్షను అడుగడుగునా మనం గమనించవచ్చు..కొన్ని శతాబ్దాల నుండి సమాజంలో అంతర్భాగమైన ఈ వివక్ష ఇప్పటికిప్పుడు పోవాలంటే పోదు. ప్రజలకి ఆ చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు కూడా మనలాంటివాళ్లే అవగాహన లేకపోవడం, వీళ్ళు బానిసలు ఏమైనా అనొచ్చన్న భావన ఉండటం, కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో చేయబడిన ప్రోగ్రామింగ్ ఫలితంగా వెనువెంటనే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో  ఇప్పటికిప్పుడుమార్పు రాకపోవచ్చు..

కానీ ఏ పని చేసిన ఆ పనిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తిపై ఉంది.. పనిని బట్టి వివక్ష చూపించడం అనే లక్షణం తరతరాలుగా నాగరిక సమాజంలో వేళ్లూనుకుపోయి ఉంది.. దీన్ని కూకటివేళ్ళతో సహా పెకళించాలి అంటే చాలా సంవత్సరాలు పట్టొచ్చు… మీ అబ్బాయ్ ఏం చేస్తున్నాడు అని అడిగితే డెలివరీ బాయ్ గా చేస్తున్నాడనో, హోటల్ లో సర్వర్ గా చేస్తున్నాడనో గర్వంగా చెప్పుకోగలిగే రోజులు వచ్చినప్పుడు సమాజంలో మార్పు వచ్చిందని అర్థం..

అదే అమెరికా లాంటి దేశాల్లో ఏ పని చేసినా ఆ పనిని ఆ వ్యక్తి చేసే వృత్తిగా గుర్తించి ఆ వ్యక్తిని గౌరవిస్తారు. అందువల్ల అక్కడ వారి చేసే పనిని బట్టి ఆ దేశంలో వివక్షకు గురికావడం అనేది తక్కువ.. 16 సంవత్సరాలు నిండిన యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా, ఏదొక పనిలో చేరి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తమకు అవసరమైన డబ్బును సంపాదించుకుంటారు. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను బట్టి వారిని చిన్న చూపు చూడటం లాంటివి అక్కడ సమాజంలో ఉండదు.

అలాంటి మానసిక ఎదుగుదల ఇప్పుడు మన దేశంలో అవసరం.. చేసే వృత్తిని బట్టి మనిషి విలువను దిగజార్చి చూడటం అనేది ఇక్కడున్న ప్రధాన సమస్య.. ఈ విషయంలో ప్రజలు మరాల్సిన అవసరం ఉంది. ప్రజలు మారితే మన సమాజంలో కూడా గణనీయమైన మార్పు వస్తుంది. కానీ వివక్షకు గురి చేస్తూ ఆత్మహత్యలు ప్రోత్సహిస్తు, హత్యలు చేస్తున్న ఈ సమాజంలో మార్పు రావాలంటే కష్టమైన పనే..కానీ అద్భుతం జరిగి మన సమాజంలో మార్పు వస్తే కనుక, చేసే పనికి గౌరవం దక్కి చిన్న చిన్న పనులు కూడా ప్రతీ ఒక్కరూ ధైర్యంగా చేయగలుగుతారు. ఏం పని చేస్తున్నావ్ అని అడిగితే బయటకి ధైర్యంగా చెప్పుకోగలుగుతారు.

సమాజం చేసే వృత్తిని బట్టి చిన్నచూపు చూస్తున్నారన్న భావనతో ఆ పనిని బయట సమాజానికి తెలియనివ్వకుండా గుట్టుగా చేస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు.. వీళ్లంతా ఆత్మనూన్యత భావంతో కుమిలిపోతూఉంటారు.. ఇలా బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు.. చేసే వృత్తిని ధైర్యంగా పైకి చెప్పుకోగల సంస్కృతి పెరిగినప్పుడు, ఆ సంస్కృతిని అంగీకరించే సమాజం కూడా మెల్లగా అభివృద్ధి అవుతుంది.. అలా ఆత్మనూన్యత భావం వదిలిన నాడు, క్రమక్రమంగా సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.. సమాజంలో మార్పు వచ్చిన నాడు చేసే పనిని బట్టి కాకుండా అందరికీ సమాన గౌరవం దక్కుతుంది.. అప్పుడే వివక్ష పూర్తిగా పోతుంది.. కానీ అలా వివక్ష పోవాలి అంటే కొన్ని తరాలు పట్టొచ్చు…