iDreamPost
android-app
ios-app

రాజుకుంటున్న రైతన్న రణం, మద్ధతుగా ఉద్యోగాన్ని వదిలేసిన డీఐజీ

  • Published Dec 13, 2020 | 11:05 AM Updated Updated Dec 13, 2020 | 11:05 AM
రాజుకుంటున్న రైతన్న రణం, మద్ధతుగా ఉద్యోగాన్ని వదిలేసిన డీఐజీ

వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటుంది. ఇప్పటికే క్రీడాకారులు, కళాకారులు కూడా గొంతు కలిపారు. 18 రోజులుగా తీవ్రమయిన చలిలోనే రైతులు రోడ్డు మీద తమ నిరసనను కొనసాగిస్తున్న చలిలో కూడా హస్తిన రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. కేంద్రం కూడా కొన్ని సవరణలకు అంగీకిరంచింది. కానీ చట్టాలు ఉపసంహరణకు ససేమీరా అంటుంది. అది జరగేవరకూ తాము వెనక్కి తగ్గేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ రైతులకు మద్ధతుగా రాజస్తాన్, హర్యానా రైతులతో పాటుగా యూపీకి చెందిన వారు కూడా ఢిల్లీకి వివిధ సరిహద్దులకు చేరుకున్నారు. సోమవారం ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తరుణంలో పరిస్థితి మరంత వేడెక్కుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో పంజాబ్ కి చెందిన జైళ్ల శాఖ డీఐజీ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. రైతులకు మద్ధతుగా ఈ మాజీ ఆర్మీ అధికారి రాజీనామా చేశారు. కెప్టెన్ లక్మీందర్ సింగ్ జక్కర్ తన పోస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి రైతులకు మద్ధతుగా నిలుస్తానని ప్రకటించారు. రైతుల విషయంలో ప్రభుత్వ తీరుకి నిరసనగా తాను ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు కేంద్ర హోం శాఖకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే యువరాజ్ సింగ్, శుభ్ మన్ గిల్ వంటి వారు తండ్రులు నేరుగా ఉద్యమంలో ఉన్నారు. యువరాజ్ కూడా తన మద్ధతు ప్రకటించారు. అనేక మంది కళాకారులు సైతం ఉద్యమ గీతాలు ఆలపిస్తూ పోరాటంలో పాలుపంచుకుంటున్నారు.

రైతులకు మద్ధతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిరసనలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఆందోళన చేసి టోల్ ఫీజు చెల్లించకుండా వాహనాలు తరలించే ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది. తాజాగా ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ వద్ద ఆందోళనకు పూనుకుంటుంది. దాంతో ఉద్యమం వేడి మరింత రాజుకుంటున్న సమయంలో కేంద్రం తుది నిర్ణయం ఎలా ఉంటుందోననే చర్చ మొదలవుతోంది. ఇప్పటికే రైతుల డిమాండ్లకు తాము తలొగ్గేది లేదని బీజేపీ ప్రకటించింది. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా రైతులను చైతన్య పరుస్తామని చెబుతోంది. మీడియా సమావేశాలు పెట్టాలని ఆపార్టీ పిలుపునిచ్చింది. దాంతో వ్యవహారం ముదురుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇరు పక్షాలు దిగిరాకపోవడంతో ఉద్యమం ఏ దిశను తీసుకుంటుందోననే ఆసక్తి కనిపిస్తోంది.