అటు తిరిగీ ఇటు తిరిగీ మళ్లీ స్వంత గూటికి చేరింది సినీనటి విజయశాంతి. బీజేపీ నుంచి ప్రారంభించిన రాజకీయ ప్రాస్థానం తిరిగి అక్కడికే చేరింది. బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకన్న విజయశాంతి అధికార టీఆర్ఎస్ పై దాడిని మొదలు పెట్టారు. కేసీఆర్ కుట్రపూరితంగా తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని, ఆయనది కుటుంబ స్వార్థమని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. కండువా కప్పుకోవడంతో దాడి మొదలుపెట్టిన రాములమ్మ బీజేపీ చేతికి చిక్కిన బలమైన అస్త్రంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సక్సెస్ ని చవిచూడలేకపోయిన విజయశాంతి భవితవ్యానికి బీజేపీ భరోసా ఇస్తుందా అనే అనుమానం కలుగుతోంది.
సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రెండు దశాబ్దాల క్రితమే రాజకీయ రంగ ప్రవేశం చేసింది. 1998లో బీజేపీలో చేరిన విజయశాంతి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో క్రియాశీలకంగా పనిచేశారు. కానీ… మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమలం గూటిని వీడిన రాములమ్మ కొత్త కొత్త అవతారాలెత్తారు. అయినా ఎక్కడా ఆమె సక్సెస్ కాలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చి స్వంత పార్టీని ప్రారంభించారు విజయశాంతి. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు.
2009లో టీఎఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు విజయశాంతి. ఉద్యమ కాలంలో ఎంపీ పదవిని కూడా వదిలేశారు. తరువాత కాలంలో టీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న కేసీఆర్ మాటతప్పారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఆమె నామమాత్రంగానే మిగిలారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తూ అడపా దడపా కనిపిస్తూ వచ్చిన రాములమ్మ గత కొంతకాలంగా దూకుడు పెంచారు.
కాంగ్రెస్ ని వీడడానికి సిద్ధమైన విజయశాంతి టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ తెరమీదకు వచ్చింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కూడా విజయశాంతి అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీకి దగ్గరయ్యేందుకే రాములమ్మ ఈ వైఖరి తీసుకున్నారనే ఊహాగానాలు చెక్కర్లు కొట్టాయి. అనుకున్నట్లే ఆమె తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం వెంకయ్యను కూడా కలిశారు. అంతకు ముందు హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో విజయశాంతి కలిశారు. మొత్తానికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదంతో బీజేపీలో ముఖ్య భూమిక పోషించాలనుకుంటోంది రాములమ్మ. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవడంతో పాటు జాతీయ స్థాయిలోనూ అవసరమైన చోట సేవల్ని వినియోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చింది కూడా.
తెలంగాణలో 2023 నాటికి అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతున్న బీజేపీకి వరుస వలసలు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. ఇంకా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎన్నికల్లో కమలం పార్టీ ఇది కలిసొచ్చే విషయమే అయినప్పటికీ బీజేపీలో చేరుతున్న నేతల భవితవ్యం మారబోదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీలో మొదటి నుంచీ పనిచేసే నేతలకే ప్రాధాన్యత ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మరి రాములమ్మ కమలం గూటిలోనా సక్సెస్ అవుతుందో లేదో?