స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా క్రైసిస్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే #AA21 సినిమా ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ – కొరటాల కాంబినేషన్ అటు ప్రేక్షకుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించేదే.
#AA21 సినిమా ప్రకటన రావడంతో గతంలో అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ‘ఐకాన్’ చిత్రం పరిస్థితి అయోమయంగా మారింది. ‘పుష్ప’ తర్వాత వేణు శ్రీరామ్ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొరటాల శివ సినిమా అధికారిక ప్రకటన రావడంతో ఇప్పట్లో ‘ఐకాన్’ పట్టాలెక్కదని స్పష్టత వచ్చినట్టే. ‘పుష్ప’ షూటింగ్ మొదలు కావడానికి మరో మూడు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత బన్నీ – కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళుతుంది ఈ లెక్కన దాదాపు వచ్చే ఏడాది చివరి వరకు అల్లు అర్జున్ మరో సినిమా చేయడం కష్టం.
ఏదేమైనా అల్లు అర్జున్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిస్ అయినట్టే. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.