చాలామందికి గుర్తుండే ఉంటుంది.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ మంగళగిరి నుంచి పోటీ చేయలేదు. కుప్పం లో క్యాండిడేట్ ని పెట్టలేదు. ప్రతిఫలంగానే అన్నట్టుగా చంద్రబాబు గాజువాక, భీమవరంలో తన పార్టీ అభ్యర్థుల ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఫలితాలు అందరికీ తెలిసిందే. ఎంతో ఆశపెట్టుకుని పవన్ కోసం తాము త్యాగాలు చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలామని టీడీపీ అభ్యర్థులు వాపోయారు. గాజువాకల్లో పల్లా శ్రీనివాస్ తన మనసులో మాటను బాహాటంగానే చెప్పుకున్నారు.
పవన్ కోసం తమ పార్టీ నేతలు గాజువాక మీద శ్రద్ధ పెట్టలేదని, లేదంటే తామే గెలిచేవారమని కార్యకర్తలతో చెప్పుకున్నారు. భీమవరంలో అంజిబాబు కూడా అలాంటి అభిప్రాయమే అంతర్గతంగా వ్యక్తం చేశారు.
Also Read : పవన్ ది ప్రభుత్వంపై అక్కసా? ఉక్కు ఉద్యమంపై చిన్నచూపా?
ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ తమతో మితృత్వం చేస్తారనే గంపెడాశతో టీడీపీ నేతలున్నారు. కానీ ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచే పొత్తుల కోసం మాట్లాడడం అంటే తమ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని ప్రజలకు చెప్పడమే అన్నట్టుగా కొందరు సందేహిస్తున్నారు. ప్రభుత్వం మీద తాము ఒంటరిగా పోరాడలేకపోతున్నామనే అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి ఈ పరిణామాలు దారితీస్తాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇక ఇటీవల పవన్ కి అనువుగా తమ కార్యక్రమాలను కూడా టీడీపీ నేతలు మార్చుకుంటుండడం పట్ల మరింత కలవరం కలుగుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పవన్ స్టేట్ మెంట్స్ కి దక్కుతున్న ప్రాధాన్యత కూడా టీడీపీ పుట్టి ముంచుతుందేమోననే సందేహాలు వ్యక్తం చేస్తన్నారు.
ఎన్నికలు సమీపించేవరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఎన్నికల సమయానికి ఇతర పార్టీల కలుపుకుని ముందుకెళితే ప్రజలు ఆదరిస్తారు గానీ ఇప్పటి నుంచే మరోడి మద్ధతు కోసం చూస్తుంటే మనల్ని చేతగాని వాళ్లుగా చూస్తారనే అభిప్రాయం టీడీపీ సీనియర్లు నేరుగా అధినేత ముందే వ్యక్తం చేశారు. చివరిలో జనసేన హ్యాండిస్తే ఏంటీ పరిస్థితి అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం పవన్ తమ చెప్పుచేతల్లో మనిషి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నటికీ జనసేన తమతోనే ఉంటుందనే ధీమా టీడీపీ అధినేతలో ఉన్నట్టు వారంతా భావిస్తున్నారు.
Also Read : కెప్టెన్ కొత్తపార్టీ.. అమిత్‌షాను కలిసిన మరుసటి రోజే ప్రకటన
సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకూ ఏపీ రాజకీయాల్లో పవన్ హల్ చల్ చేసేందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారయినట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 2 తర్వాత పవన్ మళ్లీ సినిమా షూటింగులకు వెళ్లిపోతారు. యుద్దాలు సహా అన్నీ వీరమల్లు షూటింగులోనే అన్నట్టుగా ఆయన షెడ్యూల్ ఖరారయ్యింది. దాంతో పవన్ ప్రచారానికి ఢోకా లేకుండా ఆ సమయంలో టీడీపీ నేతల కార్యక్రమాలు పెట్టుకోకుండా జాగ్రత్తపడ్డారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న లోకేష్ గానీ, చంద్రబాబు గానీ ఎటువంటి ప్రకటనలు, మీటింగులు, కార్యక్రమాలు లేకుండా పవన్ వ్యవహారాన్ని ఆస్వాదించడానికి కారణమదేననే వాదన వస్తోంది. దానికి తోడు మీడియాలో బాబు అనుకూల వర్గం పవన్ కి ఇస్తున్న ప్రయారిటీ కూడా దానిని రూడీ చేస్తోంది.
ఇలా జనసేన కోసం టీడీపీ సొంత వ్యవహారాలను సైతం విస్మరించడం చాలామందిని కలవరపరుస్తోంది. జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటుందనే లెక్కల నేపథ్యంలో రెండు జిల్లాల కోసం మిగిలిన రాష్ట్రమంతా పార్టీ పరిస్థితిని పడకేసేందుకు సైతం సిద్ధమయిపోవడం ఆశ్చర్యంగా ఉందనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచి వస్తోంది. పవన్ ఛరిష్మా గతం కన్నా పతనమయిన తరుణంలో అతని మీద నమ్మకం పెట్టుకోవడం అసలుకే ఎసరు తెస్తుందని, ఐదారు శాతం ఓట్లున్న పవన్ కి ఇప్పుడు రెండు మూడు శాతం కూడా మిగులుతాయనే ధీమా లేదనే వాదన టీడీపీలో ఓ వర్గం నుంచి వస్తోంది. పైగా పవన్ కి ప్రాధాన్యతనిస్తే బీసీలలో టీడీపీ ఎన్నటికీ పుంజుకోదనే లెక్కలు కూడా తీస్తున్నారు. దాంతో టీడీపీ అధినేత తీరు మేఘాలు చూసి ముంతలో నీళ్ళు పారబోసుకున్నట్టుగా పవన్ మీద ఆశలతో పార్టీని ఏం చేస్తారోననే బెంగ శ్రేణుల్లో కలిగిస్తోంది.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక: చప్పుడు లేని బీజేపీ, జనసేన..!