iDreamPost
android-app
ios-app

ఉక్కు బాధ్యతల నుంచి బాబు పారిపోతున్నారా?

  • Published Jul 24, 2021 | 12:09 PM Updated Updated Jul 24, 2021 | 12:09 PM
ఉక్కు బాధ్యతల నుంచి బాబు పారిపోతున్నారా?

రాష్ట్రాలకు పెద్దన్నగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గానీ.. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు గానీ నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా స్పందించాలి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. అయితే పాలకపక్షాలకు, ప్రభుత్వాలకు ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. స్వేచ్ఛగా వ్యవహరించే వెసులుబాటు ఉండదు. సమస్యలకు పరిష్కారం సాధించే విషయంలో పాలకపక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ పోరాడే అవకాశాలు, స్వేచ్ఛ, బాధ్యత ఉంటాయి. కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఆ బాధ్యతల నిర్వహణకు ఏమాత్రం సిద్ధంగా ఉన్నట్లు లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆరు నెలలుగా జరుగుతున్న పోరాటం విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరించడం ద్వారా పరోక్షంగా అవే సంకేతాలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా పోరాట కమిటీ నాయకులకు రాసిన లేఖలోనూ దాదాపు అదే భావనను వ్యక్తపరిచారు. ఈ లేఖతో ఆయన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

సీఎం జగనే బాధ్యత తీసుకోవాలట..

ప్రైవేటీకరణ వేటు నుంచి విశాఖ ఉక్కును రక్షించేందుకు గత ఆరు నెలలుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కమిటీ కన్వీనర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. దానికి సమాధానంగా చంద్రబాబు కన్వీనరుకు లేఖ రాశారు. ఉక్కు పరిరక్షణకు జరుగుతున్న పోరాటానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని అందులో డిమాండ్ చేశారు. ఉద్యమానికి వ్యక్తిగతంగా తను, పార్టీపరంగా టీడీపీ మద్దతు ఇస్తామంటూనే.. ఈ మెలిక పెట్టారు. సీఎం జగన్ ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పడం ద్వారా తనకేం సంబంధంలేదని చెప్పకనే చెప్పారని.. తద్వారా ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. పైగా అవసరమైతే ఫ్యాక్టరీ కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారని ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. అవసరమైతే అన్నారే తప్ప.. కచ్చితంగా రాజీనామా చేస్తారని చెప్పకపోవడం ఆయన డొంకతిరుగుడు వైఖరిని స్పష్టం చేస్తోంది.

Also Read : ఆర్థిక స్వాతంత్ర్యానికి 30 ఏళ్లు

మొదటి నుంచీ అదే డొంకతిరుగుడు

వాస్తవానికి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ చేస్తున్నది అదే. స్టీల్ ప్లాంటులో ప్రభుత్వ వాటాను వంద శాతం ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన వెంటనే కార్మికులు, వైఎస్సార్సీపీ తో సహా పలు రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టినా చంద్రబాబు స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించలేదు. ఎటువంటి సంబంధంలేని రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం తప్పుడు ఆరోపణలతో విషయాన్ని రాజకీయం చేసి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు. ఒక్కసారి మాత్రం విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు తప్పదన్నట్లు ఉద్యమ శిబిరాన్ని సందర్శించారు. అంతే తప్ప ప్రధాన ప్రతిపక్షంగా లీడ్ తీసుకొని కార్మికుల పక్షాన ఢిల్లీ పెద్దలను కలిసేందుకైనా కదిలిరాలేదు. జాతీయస్థాయిలో ఉందని చెప్పుకొంటున్న తన పలుకుబడిని విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉపయోగిద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడేమో ఆ బాధ్యత తమది కాదు.. ప్రభుత్వానిదే అన్న భావాన్ని ధ్వనింపజేస్తూ లేఖ రాయడంతో ఉక్కు పరిరక్షణపై చంద్రబాబుకు పెద్ద ఆసక్తి లేదని అర్థం అవుతోంది.

ప్రభుత్వ, పాలకపక్ష పోరాటం

మరోవైపు ఎన్ని పరిమితులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఢిల్లీ స్థాయిలో ఉక్కు పరిరక్షణకు పోరాడుతూ ఇప్పటికే తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. గతంలో విశాఖలో పర్యటించిన సీఎం జగన్ పోరాట కమిటీ నాయకులతో సమావేశమై చర్చించారు. ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి అసెంబ్లీ తీర్మానాన్ని పంపించారు. ఇక పార్లమెంటు సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు తరచూ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అటు రాజ్యసభ, ఇటు లోకసభలో వెల్లోకి దూసుకుపోయి ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమావేశాలను కూడా అడ్డుకున్నారు. గత మూడు రోజులుగా ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు ఢిల్లీలో ధర్నాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీల సహకారంతో పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ తదితర పార్టీల నేతలను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ ఎంపీలు మాత్రం వాటితో తమకేం సంబంధం లేనట్లు ఉంటున్నారు. వారి తీరు, చంద్రబాబు లేఖ సారాంశం చూస్తే.. టీడీపీ బాధ్యతల నుంచి తప్పించుకొని పారిపోతోందని అర్థమవుతుంది.

Also Read : వైసీపీ ఎంపీల పోరాటం ఫ‌లించేనా?