Idream media
Idream media
అచ్చెన్న మునుగుతారా .. పార్టీని ముంచుతారా!!
కొత్త అధ్యక్షుడి పరిస్థితి నిప్పుల మీద నడకే !!
మొత్తానికి మళ్ళీ ఉత్తరాంధ్ర నాయకుడికే ఏపీ టిడిపి పీఠం దక్కింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితోబాటు తాను కూడా ఎచ్చెర్లలో ఓడిపోవడంతో కళా వెంకటరావును ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన చంద్రబాబు ఆ బాధ్యతను మరో బీసీ నాయకుడైన టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నకు అప్పగించారు. మొత్తానికి ఇది పదవో , బాధ్యతో, భారమో, బరువో, ముళ్ల కిరీటమో అర్థం కాని పరిస్థితిలో అచ్చెన్న ఉన్నారు. పార్టీ అధ్యక్ష పదవి అయితే ఇచ్చారు కానీ రాష్ట్రంలో పార్టీ పతిస్థితి ఏమీ బాలేదు. అధికారం కోల్పోయిన కొద్దిరోజులకే దాని పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఏ జిల్లానుంచి ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి మారిపోతారో తెలీని స్థితి. ఎవర్నీ బతిమాలి ఇక్కడే ఉండండి మంచి భవిష్యత్ ఉంటుంది అని చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న అచ్చెన్న తాను గట్టెక్కడమే కాకుండా పార్టీని కూడా గట్టెక్కించాలి. అయితే ముందున్న సవాళ్లు, సమస్యలు చూస్తుంటే ఆయన మునుగుతారా..పార్టీని కూడా ముంచేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బాబులిద్దరూ చుట్టాలే!!
ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దడం అనుకున్నంత వీజీ కాదు. ఇక పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ అసలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండరు. హైదరాబాద్ లో ఉంటూ ఎప్పుడైనా చుట్టపు చూపుగా రావడం ఓ రోజు హడావుడి చేయడం తప్ప ఇక్కడ ఉండి ప్రజల్లోకి వెళ్లి పార్టీని నిలబెట్టేందుకు పూనుకోవడం లేదు. ఇక వాళ్ళు అక్కడ ఉంటూనే జూమ్ యాప్ ద్వారా పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. “ఈ తరుణంలో పార్టీని నడపడం మా అచ్చెన్నవాళ్ళ అయ్యేలా లేదు” అని కార్యకర్తలే ఉస్సూరంటున్నారు.
విశాఖ రాజధానికి నో అనాల్సిందే
ఇదిలా ఉండగా మూడు రాజధానులకు తెలుగు దేశంలో మిగతా నేతలు ఎలా స్పందిస్తారో తెలీదుగాని అచ్చన్న మాత్రం ఖచ్చితంగా నో చెప్పక తప్పదు. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా ఆయన విశాఖను రాజధానిగా వద్దన్నారంటే ఆయన రాజకీయ సమాధికి ఆయనే సొంతంగా ఇటుకలు పేర్చుకున్నట్లు అవుతుంది. చంద్రబాబు పక్షపాత వైఖరిని నిరసిస్తూ టిడిపి విశాఖ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఏకంగా టిడిపికి రాజీనామా చేసి విశాఖను రాజధానిగా చేసేందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జగన్ కు మద్దతు తెలిపారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో ఉన్నారని సమాచారం. లోకం పోకడ ఇలా ఉన్నపుడు అచ్చెన్న మాత్రం అట్ట కత్తులతో సాము గరిడీలు తిప్పుతాను అంటే కార్యకర్తలు, ఉత్తరాంధ్ర మీద అభిమానం ఉన్నవాళ్లు ఎలా ఊరుకుంటారు. చంద్రబాబు మెప్పుకోసం ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే జనం మాత్రం సహిస్తారా? వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నకు ఆ అగ్రహ జ్వాల సోకకుండా ఉంటుందా. చంద్రబాబు ప్రాపకం కోసం విశాఖను రాజధానిగా వ్యతిరేకించాల్సి ఉంటుంది. అలాగని ఆ విధంగా ముందుకుపోతే ప్రజలు అంగీకరించరు. ఇప్పుడు అచ్చెన్న ఆ చంద్రబాబు కోసం గట్టునుంటారా.. ప్రజల కోసం ఈ గట్టుకు వస్తారా..చూడాలి..