Idream media
Idream media
పోలవరం ప్రాజెక్టు పనులను పడకేయించినందుకు వైసీపీ నేతలు ముక్కును నేలకు రాసి క్షమపణ చెప్పాలి. మా ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసి మిగిలిన పనులు వైసీపీ ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం బీరాలు పలికిందని, కానీ ఎక్కడ పని అక్కడే ఉంది. కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వలేదు… ఈ మాటలన్నది ఎవరో కాదు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు. నిన్న మొన్నటి వరకూ సీఎం వైఎస్ జగన్ పేరెత్తి విమర్శలు చేసే దేవినేని ఉమా.. ఈ సారి అందుకు భిన్నంగా వైసీపీ నేతలు అంటూ సంబోధించడం గమనించాల్సిన విషయం. ఇది వేరే విషయం.
ఇక దేవినేని చేసిన విమర్శలలో నిజానిజాలెంత..? అనే విషయంలోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టు పనులను వైసీపీ ప్రభుత్వం పడకేయించిందన్నారు దేవినేని. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం తక్కువ.. పని ఎక్కువ జరిగిందనేది ప్రాజెక్టు పనులను నేరుగా పరిశీలిస్తే కనిపిస్తుంది. కరోనా వల్ల కొంత కాలం పనులకు ఆటంకాలు ఏర్పడినా.. వాటిని అధిగమించి పనులు జరుగుతున్నాయి. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తయ్యాయి. కొన్ని గేట్లు అమర్చారు. మిగిలిన గేట్లు బిగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాం పూర్తయింది. దిగువ కాఫర్ డ్యాం గోదావరికి వరద వచ్చే లోపు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు. ఎగువ కాఫర్ డ్యాం పూర్తికావడంతో స్పిల్ వే నుంచి రాబోయే వరద నీటిని దిగువకు వదులుతారు.
నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదన్నారు దేవినేని. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేంద్రమే భరించాలి. కానీ పరిహారం విషయంలో కేంద్రం మెలికపెడుతున్న విషయం ఉమాకు తెలియంది కాదు.
ప్రాజెక్టు పూర్తి చేయడంపై వైసీపీ ప్రభుత్వం బీరాలు పలికిందంటూ దేవినేని విమర్శించారు. ఈ మాట పలికే సమయంలో దేవినేని గతం మరచిపోయినట్లున్నారు. బీరాలు పలికి, సవాళ్లు విసిరింది తానేనని దేవినేని గుర్తులేనట్లుంది. జలవనరుల శాఖ మంత్రిగా.. అసెంబ్లీలోనే 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. నీళ్లు ఇస్తాం.. రాసిపెట్టుకో జగన్.. అంటూ దేవినేని బీరాలు పలికి.. సవాళ్లు చేశారు. సోమవారం పోలవరం అంటూ రైమింగ్ పదాలతో హంగామా చేసిన టీడీపీ ప్రభుత్వం.. పనులు తక్కువ.. ప్రచారం ఎక్కువ మాదిరిగా ప్రాజెక్టు పనులపై వ్యవహరించింది. మరి 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయినా దేవినేని.. ఏం చేస్తారంటే.. ఏమని చెబుతారో..?
తాము 72 శాతం పనులను పూర్తి చేశామని చెబుతున్న దేవినేని.. ఏ లెక్క ప్రచారం ఈ సంఖ్య చెబుతున్నారో అర్థం కావడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొదలైన స్పిల్ వే పనుల విషయంలో దేవినేని ఈ సంఖ్య చెబుతున్నారనుకోవాలి. ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించింది, కుడి, ఎడమ కాలువకు భూసేకరణ, తవ్వకం, రివిట్‌మెంట్ పనులను వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో జరిగాయి. గోదావరి నీటిని పంపుల ద్వారా ఎత్తి.. కుడి కాలవలో పోసి.. దానికి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అంటూ.. నదుల అనుసంధానం చేశామని చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకున్నారు. వాగులో చిన్నసైజు మోటార్లు పెడతాం.. నదిలో పెద్ద సైజు.. అంతే తేడా. కానీ ఆ నీరు పోయేందుకు కాలువలు ముఖ్యమనే విషయం సాధారణ రైతును అడిగినా చెబుతారు.
వాస్తవ పరిస్థితిని దాచి.. అంకెలు, సంఖ్యలతో మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. పోలవరం ప్రాజెక్టు అంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకువస్తారు. తన తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్టును తాను పూర్తి చేయాలనే ఆశయంతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. పోలవరం కల సాకారమయ్యే వేళ సమీపంలోనే ఉంది.