iDreamPost
iDreamPost
వర్షం పడకూడదు, వరద రాకూడదు అటు చంద్రబాబు నాయుడు మరోవైపు దేవినేని ఉమామహేశ్వర రావు అరిగిపోయిన పాత రికార్డును పట్టుకొని మీడియా ముందుకు వస్తారు…
మీకు అసలు నీటి ప్రాజెక్టుల గురించి తెలుసా? బచావత్ ,బ్రిజేష్ కుమార్ పేర్లు తెలుసా అంటూ మొదలు పెట్టి ఎన్టీఆర్ పుణ్యంతో సీమలో మొదలైన ప్రాజెక్టులను చంద్రబాబు పూర్తిచేసి సీమను సస్యశ్యామలం చేశారు.. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ ముఖ్యంగా వైయెస్ఆర్ కు,ఇప్పుడు వైసీపీ వాళ్లకు లేదు అంటూ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. లేటెస్ట్ గా ఈ సాయంత్రం మాజీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వర రావ్ ఇవే అంశాలను చెప్పారు.
రాయలసీమ రైతులు “నీళ్లు ఇచ్చిన దేవుడు” అంటూ చంద్రబాబుకు చేతులెత్తి మొక్కుతున్నారని దేవినేని ఉమా చెప్పారు. పులివెందుల ప్రజలు కూడా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారంట… రాయలసీమలో నీళ్లు పారుతున్నాయంటే చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు, కట్టిన ప్రాజెక్టులే కారణం అంటూ టీడీపీ ముద్రించిన రెండు పుస్తకాలు చూపారు.
ఎన్టీఆర్ 1983లో ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు గంగ ప్రాజెక్టును మొదలు దానిలో భాగమైన మొదటి ప్రాజెక్ట్ వెలుగోడు ప్రాజెక్టును 1989 కన్నా ముందు పూర్తి చేసి కొంత నీటిని నిలిపారు. ఎన్టీఆర్ ను ఈ విషయంలో ప్రజలు గుర్తుంచుకుంటారు. 2004లో వైయెస్ఆర్ జలయజ్ఞం మొదలు పెట్టిన తరువాత సీమ ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్ కట్టినవే అంటూ టీడీపీ ప్రచారం చేసింది. జలయజ్ఞం పనులు స్పీడ్ అందుకొని ప్రాజెక్టుల పనులలో పురోగతి కనిపించే కొద్దీ అది ధనయజ్ఞం అంటూ చంద్రబాబు అండ్ కో ప్రచారం చేశారు. ఇంక 2014-2019 మధ్య అన్ని ప్రాజెక్టులు చంద్రబాబే కట్టారని ప్రచారం మొదలు పెట్టారు..ఇది గత రెండు దశాబ్దాలలో నీటిప్రాజెక్టుల మీద జరిగిన ప్రచార తీరు ..
ఎన్టీఆర్ గాలేరు-నగరి,హంద్రీ-నీవా ప్రాజెక్టులకు 1988 నవంబర్ లో శంకుస్థాపన చేశారు.కానీ ఏ శంకుస్థాపనల వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? 1989 ఎన్నికల కన్నా కేవలం ఒక సంవత్సరం ముందు ఎందుకు శంకుస్థాపన చేశారో టీడీపీ చెప్పకపోయినా ,ప్రధాన ప్రత్రికలు రాయకపోయినా ప్రజలకు తెలుసు .. 1986 జనవరిలో వైఎస్ఆర్, మైసూరా రెడ్డి తదితరుల నాయకత్వంలో “కరువుబండ యాత్ర” పేరుతో తిరుపతి, మదనపల్లి,లేపాక్షి,మంత్రాలయం ,గిద్దలూరు నుంచి ఐదు బృందాలుగా యాత్ర మొదలు పెట్టి పోతిరెడ్డిపాడు వద్ద సభ జరిపిన విషయం ,ఆ ఉద్యమం ఎన్టీఆర్ మీద తెచ్చిన ఒత్తిడి ఫలితం ఆ శంకుస్థాపనలు అన్నది చారిత్రిక సత్యం .
Also Read: నీరు చెప్తున్న సత్యం..చంద్రబాబు చెప్తున్న అసత్యం .. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగ చరిత్ర
శంకుస్థాపనలతోనే సరి
1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం కాంగ్రెస్ గెలిచి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావటం,తదుపరి జనార్దన్ రెడ్డి, కోట్ల వియజయభాస్కర్ రెడ్డి మొత్తంగా ఐదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులు కావటం తెలిసింది.
ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన గాలేరు-నగరికి చెన్నారెడ్డి పరిపాలన అనుమతులు ఇచ్చారు. పనులు మొదలయ్యాయి కానీ పెద్దగా పురోగతి లేదు. కోట్ల హయాంలో కేసి కెనాల్ ఆధునీకరణ జరిగింది. దానితో ఆదా అయిన 11 టీఎంసీ ల నీటితో పాటు పునరుత్పత్తి ద్వారా ఆదా అయిన మరో 8 టీఎంసీలు కలిపి మొత్తం 19 టీఎంసీలు SRBC(శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ )కి కేటాయించమని కేంద్ర జలసంఘాన్ని కోరగా 1994లో ఆ కేటాయింపులు జరిగాయి.. ఆ విధంగా సీమకు కృష్ణా నికర జలాలు కేటాయింపు జరిగింది. అన్ని మేమే కట్టాము అని ఎవరు ప్రచారం చేసుకున్నా జీవో లు ,నిధుల విడుదల, నీటి కేటాయింపు లెక్కలు సత్యాన్ని చెప్తాయి.
వైఎస్ఆర్ భగీరథ యత్నం
వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత జలయజ్ఞం పేరుతో తెలంగాణా,ఆంధ్రా,రాయలసీమ ప్రాంతాలలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలయ్యాయి. రాయలసీమలో గాలేరు-నగరి,హంద్రీ-నీవా తో పాటు గండికోట, తెలుగు గంగ పథకంలో బ్రహ్మం సాగర్,చిత్రావతి అప్ గ్రేడ్ లాంటి ప్రాజెక్టులు మొదలు పెట్టారు… అప్పుడు మాత్రం మేము అంటే ఎన్టీఆర్ కానీ 1995-2004 మధ్య తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రాబాబు కానీ మేమే ఈ ప్రాజెక్టులు ఎప్పుడో కట్టేశాం అని అనలేదు.. అలా అంటే ఎక్కడ కట్టారు? . నది ఒడ్డున పంప్ హౌస్ కట్టారా లేక పోతిరెడ్డి పాడు నుంచో ,బానకచెర్ల నుంచో కాలువ తవ్వారా?. గండికోట ఆనకట్ట కట్టారా అని వైఎస్ఆర్ ,నాటి నీటి పారుదల మంత్రి పొన్నాల లేక సీనియర్ ఎమ్మెల్యే డీఎల్, కాటసాని రాంభూపాల్ రెడ్డి లాంటి వారు అడిగేవారు.. సభాసంఘాన్ని వేసి (అప్పట్లో ఈ సాంప్రదాయం ఉండేది,2014లో దీనికి చంద్రబాబు తిలోదకం ఇచ్చారు) నిజాలు తేల్చమని అడిగేవారు.
మరి ఏమి ప్రచారం చేశారు? అది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తల రాశారు. ఆ యజ్ఞంలో నాటి టీడీపీ నేత చంద్రబాబు కుడి భుజం సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ కి ప్రాజెక్టులు దక్కాయన్న విషయాన్ని కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు క్వాలిఫై కాలేదని నామ నాగేశ్వర రావుకి చెందిన మధుకాన్ సంస్థ కోర్టుకు వెళ్ళింది కూడా.
Also Read: దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం
2004-2014 మధ్య ఏ ప్రాజెక్టులు పూర్తయ్యాయి?
అప్పట్లో ప్రాజెక్ట్ అనుమతులు చాలా కఠినముగా ఉండేవి. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి దక్కాలంటే చుక్కలు కనిపించేవి. మరో వైపు నిధుల కోసం ప్రణాళిక సంఘం వద్దకు వెళ్ళాలి. అప్పు తీసుకోవాలన్నా కానీ చాలా కండిషన్లు ఉండేవి. వైఎస్ఆర్ మొదలు పెట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావలసిన భారీ యంత్రాలను ప్రాజెక్ట్ సైట్ కు తీసుకు వెళ్ళటానికి నలమల అడవిలో రోడ్ విస్తరణ పనులకు కూడా NGT అనుమతులు ఇవ్వలేదు, కృష్ణా నదిలో పడవల మీద యంత్రాలను తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చింది. మరో వైపు భూసేకరణ మీద రైతులు వేసిన నిజమైన కేసులతో పాటు రాజకీయ ప్రేరేపిత కేసులు ఎక్కువే..
ఇన్ని అవరోధాల మధ్య పోతిరెడ్డిపాడు కెపాసిటీని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచటం, బ్రహ్మం సాగర్, గండికోట, చిత్రావతి ప్రాజెక్టులు వైఎస్ఆర్ హయాంలోనే పూర్తికాగా గాలేరు-నగరి,హంద్రీ-నీవా,వెలిగొండ పనుల్లో మంచి పురోగతి అంటే దాదాపు 50% పూర్తయ్యాయి. ముచ్చుమర్రి,పైడిపాలెం పనులు 70% పైన పూర్తయ్యాయి.
జీవో 69 vs జీవో 170
శ్రీశైలం డ్యామ్ లో 854 అడుగుల స్థాయిలో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం MDDL(Minimum Drawdown Level,నీటిని ఎన్ని అడుగుల నుంచి తీసుకోవనే లెక్క ) 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గిస్తూ 15-Sep-1996 న చంద్రబాబు జీవో 69ని విడుదలచేశారు. ఆ రోజు రాయలసీమ టీడీపీ నేతలకు దీని వ్యతిరేకించే ధైర్యం లేకుండా పోయింది. వ్యతిరేకించిన వైఎస్ఆర్, మైసూరా రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలను అభివృద్ధి నిరోధకులు అంటూ ప్రతిదాడి చేశారు.
వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44000 క్యూసెక్కులకు పెంచారు, మరి శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటిని మైంటైన్ చేయకుంటే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఎలా ఆవస్తాయి?శ్రీశైలంలో 834 అడుగుల్లో నీళ్లు ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరు కూడా పారదు ,841 అడుగులు ఉంటే కొంచం నీరు పారుతుంది.
పై విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ శ్రీశైలం MDDL ను 834 నుంచి 854 అడుగులకు పెంచుతూ 13-Sep-2005 న జీవో170ని ఇచ్చారు.
ఒక్క బొక్కెన నీరు అదనంగా తీసుకున్నా తలలు తెగుతాయి – దేవినేని ఉమా
జీవో 170 తో కృష్ణా డెల్టా కు నీరు తగ్గుతుందని,డెల్టా ఎడారి అవుతుందని, వైఎస్ఆర్ రాయలసీమకు నీటిని దోచి పెడుతున్నాడని ఆరోపిస్తూ ప్రకాశం బ్యారేజి కింద టెంట్ వేసుకొని మూడు రోజుల పాటు టీడీపీ నేతలు ధర్నా చేశారు. నాడు దేవినేని ఉమా ఒక్క బొక్కెన నీరు తీసుకున్న తలలు తెగుతాయంటూ ఊగిపోయాడు.. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే .. ఇప్పటికి గూగుల్లో ఆ ఫోటోలు దొరుకుతాయి. చంద్రబాబు మాత్రం తన రెండుకళ్ల సిద్ధాంతంతో అన్ని ప్రాంతాలు బాగుండాలి అన్నారు కానీ టీడీపీ నేతల ధర్నా మీద కానీ జీవో 170 మీద కానీ స్పందించలేదు.
రాయలసీమ నీటి మీద దేవినేని ఉమా కు ఉన్న చిత్తశుద్ధి ఇది.
అన్ని మేమే కట్టాం..
ఈ రోజు ప్రెస్ మీట్లో దేవినేని ఉమా చూపించిన రెండు పుస్తకాలలో ఒకటి హంద్రీ-నీవా ప్రాజెక్టుకు సంబంధించింది. 96 పేజీలు ఉన్న ఆ పుస్తకములో పునాదులు వేసిన వైఎస్ఆర్ పేరు కానీ ,చరిత్రలో మొట్టమొదటిసారి కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కానీ, ఆ నీటితోపాటు కాలువ గట్టున 210 కి.మీ పాదయాత్ర చేసిన రఘువీరా రెడ్డి పేరు కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.
హంద్రీనీవా నీటిని కుప్పంకు ఎందుకు తీసుకువెళ్లడం లేదు అని ప్రశ్నించిన దేవినేని ఉమా 1988లో శంకుస్థాపన జరిగిన ఆ పథకం 16 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అందులో 14 సంవత్సరాలు స్వయంగా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీటిని ఎందుకు తీసుకు వెళ్లలేకపోయారో సమాధానం చెప్పాలి లేదా చంద్రబాబు ను ప్రశ్నించాలి.
తలకట్టు నుంచి నడుము వరకు కాంగ్రెస్ హయాంలో పనులు పూర్తయ్యి నీళ్లు పారితే నడుము నుంచి పాదాల వరకు నీటిని తీసుకొని పోవటంలో చంద్రబాబు ఎందుకు వైఫల్యం చెందారో సంజాయిషీ ఇవ్వవలసిన బాధ్యత మాజీ నీటి పారుదల శాఖా మంత్రిగా దేవినేని ఉమా మీద ఉంది.
అదే విధంగా గాలేరు నగరి
ఈ పథకం కింద 2013లోనే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే గండికోటకు 2 టీఎంసీ ల నీటిని ఇచ్చారు. కిరణ్ గండికోటతో పాటు పైడిపాళెం , హంద్రీ-నీవా తో పాటు ముచ్చుమర్రిని పట్టించుకోని ఉంటే ఆ రెండు చిన్న ప్రాజక్టులు 2014కు ముందే పూర్తయ్యేవి. పిడికెడంత ముచ్చుమర్రి లిఫ్ట్ ను రాయలసీమ జీవ నాడి అంటూ మీడియా ముందు మాట్లాడే చంద్రబాబు,దేవినేని ఉమా వారు వేసిన పుస్తకంలో మాత్రం ఏమి రాశారు కింది ఫొటోలో చూడండి,
గండికోట నీటి నిల్వ ,జగన్ ప్రభుత్వ వైఫల్యం
గండి కోటలో పూర్తి సామర్ధ్యంతో నీటిని ఎందుకు నింపటం లేదు అంటూ దేవినేని ఉమా మరొక ఆరోపణ చేశారు. ఎవరి వైఫ్యలమో తేల్చే తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి గ్రామాలను ఎందుకు ఖాళీ చేయించలేక పోయారో సమాధానం చెప్పాల్సింది ఎవరు?. నాటి నీటి పారుదల శాఖా మంత్రా లేక నాటి ముఖ్యమంత్రా?
పునరావాసంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి?
గండికోట పునరావాసంలో నాటి ప్రభుత్వం రెండు ప్యాకేజీలు ఇచ్చింది. ఏక మొత్తంగా 10 లక్షలు తీసుకొని ఖాళీ చేయటం లేదా 7 లక్షలు తీసుకొని ప్రభుత్వం కట్టించి ఇచ్చే పునరావాస కాలనీలలో ఇళ్ళు తీసుకోవటం.
ముంపు గ్రామ ప్రజలలో ఎక్కువ మంది రెండో ఆప్షన్ తీసుకున్నారు. గత ఐదేళ్ళలో పునరావాస కాలనీల నిర్మాణంలో జరిగిన జాప్యం చేశారు..గడచిన సంవత్సరంలో ఒక మోస్తరు నిర్మాణాలు జరిగాయి కానీ ఇప్పటికి నిర్మించ వలసిన ఇళ్ళు చాలానే ఉన్నాయి. జూన్ 24న పునరావాస పరిహారం కింద 522.85 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు వినియోగం,పంపిణీలో అధికారులు వేగం పెంచాలి.
గండికోటలో 2013లో 2.5 టీఎంసీ నుంచి మొదలు పెట్టి 2018(చంద్రబాబు సీఎం ) మరియు 2019(జగన్ సీఎం ) లో 12 టీఎంసీల నీటిని నింపారు. గండికోటలో ఈ సాయంత్రానికి 12.5 టీఎంసీ ల నీరు ఉంది.గండికోట చరిత్రలో ఇదే రికార్డ్. ఈ రైన్ సీజన్ మరో 30 రోజులకు పైగా ఉంది. కృష్ణా మీద అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి . ఏ లెక్కల ఆధారంగా గండికోటలో 20 టీఎంసీ నీటిని నిలువ చేస్తామని అధికారులు చెబుతున్నారు. 20 టీఎంసీ లు నిలువ చేయగలిగితే గొప్ప విషయమే.. కానీ అటు ఇటుగా 17 టీఎంసీ ల నీటిని నిలువ చేయగలరని నా అంచనా.
రాజకీయ విమర్శలు ఎలాఉన్నా పోతిరెడ్డిపాడు చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కులు విడుదల చేసినట్లే గండికోటలో పూర్తిస్థాయిలో 26 టీఎంసీ లు వచ్చే సంవత్సరం నిలువ చేయాలి.2007లో పూర్తయిన 17.74 టీఎంసీ ల సామర్ధ్యంగల బ్రహ్మం సాగర్లో వైఎస్ ఆర్ హయాంలో ఒక్కసారి 12 టీఎంసీలు నిలువ చేశారు. గత ఏడెనిమిది సంవత్సరాలుగా 3 టీఎంసీల మించి నింపలేక పోతున్నారు. ఈ సంవత్సరం మాత్రం 5 టీఎంసీలు నింపారు(APWRIMS సైట్ లో అప్డేట్ చెయ్యలేదు).
జగన్ ప్రకటించిన కుందు నుంచి బ్రహ్మం సాగర్ లిఫ్ట్ త్వరగా పూర్తి చేసి 2023 లోపే బ్రహ్మం సాగర్లో 17టీఎంసీలు నింపాలి,ఈ దిశగా పనులు వేగవంతం చేయాలి.
దేవినేని ఉమా రాజకీయ విమర్శలు కాకుండా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మంచిది. అన్ని మేమే కట్టాం ,చంద్రబాబును దేవుడిలా చూస్తున్నారు లాంటి మాటలతో నష్టమే తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములకు అనేక కారణాలు ఉండొచ్చు కానీ దేవుడిలా చేసే మనిషికి ఓటు వేయకుండా ఉండరు.. ఈ రోజు ప్రెస్ మీట్లో దేవినేని ఉమా ప్రస్తావించిన ప్రాజెక్టులు ఉన్న నియోజకవర్గాలలో ఒక్కటంటే ఒక్కదానిలోనైనా టీడీపీ ఎందుకు గెలవలేదు అనేది ప్రజల కన్నా టీడీపీ వారికే బాగా తెలుసు.