iDreamPost
iDreamPost
రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనతో తూర్పుగోదావరి.. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా మూడు జిల్లాలుగా ఆవిర‍్భవిస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికగా ఏర్పడుతున్న వీటిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆవిర్భవించనున్న తూర్పుగోదావరి, ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పడుతోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరిలో ఉన్న కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, తూర్పుగోదావరిలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లతో ఏర్పడుతున్న ఈ జిల్లాకు మహర్దశ పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ జిల్లాలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రెండు మున్సిపాలిటీలు (నిడదవోలు, కొవ్వూరు) ఉంటాయి. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌కు సబ్ కలెక్టర్ కార్యాలయ భవనంపై అంతస్తుల నిర్మాణం, ధవళేశ్వరంలో ఖాళీగా ఉన్న ఐదు ఎకరాలు ప్రతిపాదనలో ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు ఏర్పాటై శాశ్వత భవనాలతో ఉండటంతో కొత్తగా ఎస్పీ కార్యాలయం కోసం కసరత్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఆవిధంగా కొత్త జిల్లాకు భవన నిర్మాణాలపరంగా సమయం, డబ్బు ఆదా అవుతాయి.
విశిష్టతల సమాహారం..
దశాబ్ధాల చరిత్ర గల సుందర నగరంగా పేరొందిన రాజమహేంద్రవరం ఎన్నో విశిష్టతల సమాహారం. బ్రిటీష్ కాలం నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఇక్కడ మూడు పువ్వులు ఆరుకాయలుగా విస్తరించాయి. రోజూ దాదాపు లక్షమంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు ఇక్కడకు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారంటేనే ఈ నగరం విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా, వైద్య పరంగా ఎందరో ఉద్దండులకు నెలవైన ఈ నగరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన నేపథ్యంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రగతికి అనేక అవకాశాలు..
రోడ్డు, రైల్వే, విమానయాన సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరం జాతీయ రహదారి 16కు అనుసంధానమై ఉంది. నగరంలో మూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషన్‌ను ఇటీవల విస్తరించారు. నాలుగో ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నగరంలో మోరంపూడి జంక్షన్, దివాన్ చెరువు, వేమగిరి వద్ద ఫ్లై ఓవర్ల బ్రిడ్జిలను ఇటీవలే కేంద్రం మంజురు చేసింది. ఈ మూడు 16వ నెంబరు జాతీయ రహదారిపై నిర్మిస్తారు. వీటి నిర్మాణం పూర్తయితే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఇతర ప్రాంతాల నుంచి జనం రాకపోకలు మరింత పెరుగుతాయి. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్ లలోని వారికీ ఇకపై రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం కానుండడంతో ఆ మేరకు నగరానికి ఆ ప్రాంతాల ప్రజలరాకపోకలు పెరుగుతాయి.
ఇరిగేషన్ హెడ్ క్వార్టరు ధవళేశ్వరం, దేశంలోనే పేరెన్నికగన్న కడియం నర్సరీలు, పేపరుమిల్లు,హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఓఎన్జీసీ, గెయిల్, సీటీఆర్ఐ వంటి వాటితో అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు రాజమహేంద్రవరం నెలవుగా ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారనుండడంతో మరింత ప్రగతి సాధిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. పుష్కలమైన గోదావరి జలాలు, రోడ్డు, రైలు, విమానయాన సౌకర్యాలు, భూమి లభ్యత వంటి అనుకూలతల వల్ల భవిష్యత్తులో ఇక్కడ కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొత్తగా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.