కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారాయి. ఈ నియోజకవర్గంలో దేవగుడి నారాయణరెడ్డి తన వర్గంతో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడడంతో దేవగుడి నారాయణరెడ్డి వర్గం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం టీడీపీకి కలిసి రానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవగుడి నారాయణ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గతంలో టీడీపీ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు భాద్యతలను చంద్రబాబు అప్పగించారు.
ఒకరకంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ వైరం నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో చేరింది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆది నారాయణరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా రామ సుబ్బా రెడ్డి పై విజయం సాధించి ఆ తర్వాత వైసీపీకి వెన్ను పోటు పొడిచి టీడీపీలో చేరారు. చంద్రబాబు కేబినెట్ లో కూడా ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించగా ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వ విప్ గా నియమించి తాత్కాలికంగా ఊరుకోపెట్టారు.
2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలయ్యాక కొంతకాలానికి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. గత ఏడాది రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీకి ఈ నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేకుండా పోయారు. అయితే రామసుబ్బారెడ్డి వైసీపీకి వెళ్లినా ఆయన అనుచరుడు రమణారెడ్డి కుటుంబం టీడీపీలోనే ఉంది. ఈ క్రమంలో జంబాపురం రమణారెడ్డి కుటుంబ సభ్యులకు, దేవగుడి కుటుంబానికి రాజకీయ వైరం ఉండడంతో ఇరు కుటుంబాలు కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో భూపేష్ రెడ్డి ని జమ్మలమడుగు నుంచి గెలిపించాలని అలా గెలిపిస్తే రమణారెడ్డి కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని అధినేత హామీ ఇచ్చారట. అయితే అన్న ఆదినారాయణ రెడ్డి వెంట పెద్దగా క్యాడర్ వెళ్లలేదని, తమ వెంట అందరూ ఉన్నారని నారాయణ రెడ్డి వర్గం చెబుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read : Jr Ntr – టీడీపీలో ముదురుతున్న అంతర్గత వైరం, బాబు తర్వాత ఎవరనే చర్చ ఉధృతం