iDreamPost
android-app
ios-app

డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానం

డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానం

 డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 13,200 కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్‌ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉందని తెలిపింది. డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం సీఎస్‌ ఎస్‌.కే జోషి నిర్వహించిన సమావేశంలో పాల్గొంది. అనంతరం కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి చేరుకుని డెంగీ నిర్మూలనకు చేపడుతున్న చర్యలను పరిశీలించింది.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. అందులో 58 మంది మరణించారన్నారు. తెలంగాణలో ఇద్దరు డెంగీ కారణంగా మరణించారని, కర్ణాటకలో 12 మంది, ఉత్తరాఖండ్‌లో 8 మంది డెంగీతో మరణించారన్నారు. తెలంగాణలో 40 నుంచి 50% వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవడం వల్లే డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర బృందం అంగీకరించింది.