iDreamPost
android-app
ios-app

ఢిల్లీలో మరీ ఇంత వాయుకాలుష్యానికి కారణాలేంటి ?

ఢిల్లీలో మరీ ఇంత వాయుకాలుష్యానికి కారణాలేంటి ?

ఢిల్లీలో కాలుష్యంలో ప్రజలు నివసించటానికి భయపడుతున్నారని,అక్కడి ప్రజలని ఒకే సారి చంపేయండి అంటు సుప్రీం కోర్టు తన అసహన్ని తెలిపింది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం ఎంత చెప్పిన అక్కడి ప్రభుత్వం వినకపోవడంతో సుప్రీంకోర్టు సోమవారం ఇలా వాఖ్యలు చేసింది.ఢిల్లీ లో మనుగడ సాగించడం నరకం కంటే భయంకరంగా ఉందని సుప్రీం కోర్టు వాఖ్యానించింది. దేశ రాజధాని లో వాయుకాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. దీని వలన ముఖ్యంగా పిల్లలు,చిన్నపిల్లల పై తీవ్ర ప్రభావం పడుతుంది.అక్కడి ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు.. వాతావరణంలో పెరిగిన వాయుకాలుష్యం తో ఢిల్లీలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వాయుకాలుష్య నివారణకు చర్యలు తీసుకున్న అవిఫలితాలు ఇవ్వటం లేదు..

పదహారు వందల నగరాల పై ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయునాణ్యత సర్వే జరపగా అందులో ఢిల్లీ నగరం అత్యంత విషవాయువులతో నిండిందని తేలింది. కేంద్ర కాలుష్య నివారణ సంస్థ వెల్లడించిన వాయు నాణ్యత సూచి లో 500 పాయింట్ల స్కేల్ లో 480 పాయింట్లను ఈ ఏడాది డిల్లీ కాలుష్యం చేరింది. అంటే ఇక్కడ గాలి ఎంత కలుషితం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. శీతాకాలంలో ఇది మరీ ప్రమాదకరంగా మారుతోంది. ఢిల్లీ వాతావరణంలో అత్యంత విషపూరితమైన వాయువులు ఉన్నాయని 2016 లోనే డబ్ల్యుహెచ్ఒ తెలిపింది.కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య నివారణకు ఢిల్లీ గవర్నమెంట్ చేపట్టిన సరి-భేసి విధానంతో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి రాలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో వాతావరణం కలుషితం కావడానికి దుమ్ము, ధూళి, రహదారులపై పేరుకు పోయిన చెత్త, వాహనాలు, ఎసిలు, ఫ్రిజ్ లు భారీ పరిశ్రమలు, ఇంధన వినియోగం కారణాలు. వాయుకాలుష్యానికి ఇంకో ప్రధాన కారణం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో రైతులు పంట వ్యర్ధాలను తగలబెట్టడం, దీని వలన విపరీతమైన కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి చేరుతోంది. ఒక్క పంజాబ్ లోనే పంట మిగులును తగలబెట్టడం వల్ల 15 నుండి 20 రోజుల వ్యవధిలో 2.2 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి విడుదల అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో వరి పంట కోసాక మిగిలిన వాటిని పశు గ్రాసంగా ఉపయోగిస్తారు కానీ ఉత్తర భారతదేశంలో వాటిని తగలబెడతారు, ఇదే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం. పంట వ్యర్దాలను తగలబెట్టకుండా వాటికి వేరే ప్రత్యామ్నాయం చేసినట్లయితే పరిస్థితి కొంచెం అదుపులోకి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంత చెప్పినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వినకపోవడం వల్లనే ఢిల్లీ లో ఇప్పుడు ఇంత భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని స్వయాన దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు చీవాట్లు కూడా పెడుతోంది .కానీ అక్కడ వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు, దాని పర్యవసానమే ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం విపరీతంగా కలుషితం అవడం.