సమయం సోమవారం అర్ధరాత్రి రెండు గంటలు.. ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం.. అంశం జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది.?చంద్రబాబు సమీక్ష.
అయితే సాధారణంగా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓటమి చవిచూసిందో అందరికీ తెలుసు.. జిల్లాలో చిన్న పిల్లాడిని అడిగినా ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవాలో అనేక స్థానాల్లో టిడిపి ఓటమి పాలైంది.. అయితే అది వేరే విషయం.. కానీ దెందులూరు గురించి మాత్రం అందరికీ చాలా క్లారిటీ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేపై లేనంత పెద్దఎత్తున అవినీతి, రౌడీయిజం ఆరోపణలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఉన్న విషయం అందరికి తెలిసిందే. అధికారులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు అన్న బేధం లేకుండా ఎవరితోనైనా ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తి కావడం, దాడులు, దోపిడీలు, రౌడీయిజం అన్నీ చింతమనేని ఓటమికి కారణమయ్యాయి.
ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు.. కానీ ఎందుకు ఓడిపోయాము?అని అమాయకత్వంతో కూడిన ప్రశ్న అడుగుతుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగుతూ ఎవరు చూడటం లేదు అనుకున్నట్లే ,తన పాలనలో జరిగిన అక్రమాలు,దౌర్జన్యాలను అనుకూల మీడియా కవర్ చేస్తుంది అని భ్రమించాడు. దెందులూరులో ఎందుకు ఓడిపోయింది చంద్రబాబుతో పాటు తణుకు నియోజవర్గంలో సమీక్షలో పాల్గొన్న చింతమనేనికి, మాజీ ఎంపీ మాగంటి బాబుకి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మికి ఇతర నాయకులకు కూడా తెలుసు ముఖ్యంగా ప్రజలందరికీ తెలుసు. అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు పలు వ్యాఖ్యలు చేసారు..
మనం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం.. రాజధాని ఏర్పాటు చేసాం, పోలవరం పనులు చేపట్టాం.. దెందులూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసాం, స్థానిక సంస్థల్లో 90శాతం విజయం సాధించాం.. కచ్చితంగా గెలుస్తాం అనుకున్న నియోజకవర్గంలో ఎందుకు ఒడిపోయాం అంటూ పైపైకి ప్రశ్నించారు.. ప్రస్తుతం చంద్రబాబు ఎక్కడికెళ్లినా ఇలానే మాట్లాడుతున్నారు. గతంలో హైదరాబాద్ నేనే నిర్మించాను, ప్రపంచ పటంలో పెట్టాను.. అని ఒక దశాబ్దం పాటు చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రతి నియోజకవర్గానికి వెళ్లి చాలా చాలా అభివృద్ధి చేశాం.. పోలవరం నిర్మించాం, రాజధాని ఏర్పాటు చేసాం.. అంటూ మాట్లాడటం సొంతపార్టీ నేతలకే మింగుడు పడడం లేదు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు పార్టీ గెలుపోటముల గురించి కూలంకషంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే పార్టీకి కూడా మంచిదనే అభిప్రాయాలు పార్టీ శ్రేణులనుండే వ్యక్తమవుతున్నాయి.