iDreamPost
android-app
ios-app

మోడీ రాజ్యంలో మరింత క్షీణించిన జీడీపీ

  • Published Dec 24, 2019 | 11:26 AM Updated Updated Dec 24, 2019 | 11:26 AM
మోడీ రాజ్యంలో మరింత క్షీణించిన జీడీపీ

ప్రపంచంలో ప్రతి విషయాన్నీ గణాంకాలే ప్రాతిపదికగా విశ్లేషిస్తున్నాం. అలాగే ఒక దేశం వృద్ధి చెందుతుందని చెప్పడానికి కూడా కొన్ని గణాంకాలు వాడుతున్నారు.. ఏళ్ళ తరబడి వివిధ వాదనలు వినిపిస్తున్న, ముఖ్యంగా జీడీపీ అనేది అతి ప్రధాన గణాంకంగా ఆర్ధిక వేత్తలు, ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఒక దేశం వృద్ధి చెందుతోంది అని చెప్పడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది జీడీపీ నే ప్రాతిపదిక గా గుర్తిస్తున్నారు…

అసలు జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి – Gross Domestic Product) అంటే ఏంటి?

సింపుల్ గా చెప్పాలంటే “ఒక దేశం లో ఒక సంవత్సరం లో ఉత్పత్తి కాబడిన మొత్తం వస్తువులు, సేవల విలువ”. జీడీపీ వృద్ధి ని కొలిచేటప్పుడు ఇందులో Inflation effect ని తీసేస్తారు. సగటు జీడీపీ అంటే, మొత్తం జీడీపీని మొత్తం జనాభా తో భాగిస్తే వచ్చే ఒక వ్యక్తి ఉత్పత్తి విలువ…

ఫార్ములా ప్రకారం, ఒక దేశం లో మొత్తం వినియోగం + పెట్టుబడులు + ప్రభుత్వ ఖర్చులు + ఎగుమతులు – దిగుమతులు = జీడీపీ… ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉన్న దేశంలో జీడీపీ చాలా తక్కువ గా ఉంటుంది.. కారణం, వేరే దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తువులు, సేవలు ఈ దేశంలో వినియోగించడం వలన…

కానీ చెప్పినంత సులువు కాదు జీడీపీని కొలవడం… ఉదాహరణకి ఒకరు ఒక కిలో మైదాపిండి, కిలో చక్కెర కొని ఒక కేక్ తయారు చేస్తే – ఇందులో మొదట ఉత్పత్తి కాబడింది గోధుమలు, చెరుకు..వాటిలోంచి ఉత్పత్తి కాబడినవి మైదా, చక్కెర. వాటిలోంచి కేక్… వినియోగదారుడు ఆఖరుగా ఆ కేక్ ని తింటున్నాడు… కాబట్టి ఆ కేక్ విలువనే జీడీపీలో కలుపుతారు… ఆ గోధుమ-చెరుకు విలువని కలపరు.. ఆఖరుగా వినియోగదారుడు కొన్న విలువనే జేడీపీకి ప్రాతిపదిక… ఇదే జాతీయ స్థాయి లో ఊహించుకుంటే, మన జీడీపీని కొలిచే పద్దతి, ప్రక్రియ ఎంత సంక్లిష్టతతో కూడుకుందో అర్థం అవుతాయి..

పరిశ్రమ లు సంస్థాగతంగా ఉండి, అందరూ టాక్స్ లు కట్టే కొన్ని దేశాల్లో జీడీపీని కొలవడం సులువే.. ఇంత వైశాల్యం, ఇంత జనాభా , అసంఘటిత పరిశ్రమలు భారీ స్థాయి లో ఉన్న మన దేశంలో ఇది చాలా చాలా కష్టం..

ఇండియా జీడీపీ

1700 AD ప్రాంతం లో మొఘలులు పరిపాలించే సమయంలో ప్రపంచ జీడీపీలో భారత జీడీపీ షేర్ 25% పైనే… 1947AD అంటే మనకు స్వాతంత్య్రం వచ్చేసమయానికి అది 3% కి పడిపోయింది… అంటే 200 ఏళ్ళ లో బ్రిటిష్ వాళ్ళ దోపిడీ, ఈ దేశం పట్ల వాళ్ళు అనుసరించిన అభివృద్ధి నమూనా మన కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.. ఇప్పుడు ప్రపంచ జీడీపీ లో ఇండియా భాగం దాదాపు 8%.. కానీ ప్రపంచ జనాభా లో మన భాగం 20%…

1980 దశకంలో మన సగటు జీడీపీ వృద్ధి దాదాపు 5%.. 1991లో మన దేశం సరళీకృత ఆర్ధిక విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతవరకూ చాలా వరకూ అందుబాటులో లేని దేశ ఆర్ధిక గణాంకాలు అందుబాటు లో కి వచ్చాయి. Transparency పెరిగింది..

పీవీ హయాంలో 1994 లో 6%, 1995 లో 7% పైనే నమోదు అయ్యింది… 1999 లో NDA-1 అధికారం లో కి వచ్చాక 2000 లో 5% కన్నా దిగువ కి పడిపోయింది… 2002 లో 3.9%. గత 20 ఏళ్ళలో ఇదే కనీస స్థాయి.. (2008 లో ప్రపంచ ఆర్ధిక మందగమనం వల్ల మళ్ళీ ఆ స్థాయి నమోదు అయ్యింది)

దేశం వెలిగిపోతోంది అని 2004 లో ఎన్నికలకు వెళ్లిన అద్వానీ-వాజపేయి పిలుపు పనిచేయలేదు… ఎందుకంటే అంత వెలుగులు దేశం లో ఎక్కడా లేవు అప్పటికి… 2004 లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మన ఆర్ధిక రంగం పుంజుకుంది… వరుసగా 2005, 2006, 2007 లో 9% పైనే వృద్ధి నమోదు అయ్యింది. 2008 లో subprime crisis ప్రకంపనల మూల్యంగా స్తంభించిన వృద్ధి తిరిగి 2009 లో 8.5%, 2010 లో ఏకంగా 10% పైనే నమోదు అయ్యింది…

మోడీ హయాంలో

2011 నుంచీ 7-8% మధ్య ఊగిసలాడిన వృద్ధి, మళ్ళీ తిరోగమనం మొదలుపెట్టింది మోడీ నోట్ల రద్దు నిర్ణయం తర్వాతే.. దానికి తోడు ఉరుకులు పరుగుల మీద తెచ్చిన GST వ్యవస్థ…

2014 లో Minimum Government – Maximum Governance నినాదం తో ఎన్నికలకు వెళ్ళాడు మోడీ. కానీ గెలిచాక పాలనలో మార్పులు ఏమీ రాలేదు.. అంతకుముందు UPA ప్రభుత్వం అమలుపరచిన ఆర్ధిక విధానాలను, సంక్షేమ పథకాలను కొనసాగించారు. సంక్షేమం మరింత ఖర్చు పెంచారు…

పాలన ఫోకస్ మొత్తం ఎన్నికల్లో గెలవడం మీదా, లేదా అవతలి పార్టీ నాయకుల్ని కొనడం మీద, విదేశాలు చుట్టడం మీదా ఉండి.. ముమ్మారు తలాక్ విషయం మీద పెట్టినంత శ్రద్ధ మరింత పనికివచ్చే ఆర్ధిక వృద్ధి, అభివృద్ధి విషయం లో పెట్టడం లేదు…

ఆర్ధిక పరంగా కొత్త సంస్కరణలు ఏవీ తేలేదు. కొత్త ప్రాజెక్టులు ఏవీ మొదలుపెట్టలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా, ఇక్కడ మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతోందో అంతుపట్టడం లేదు…

2019 లో 5% కంటే తక్కువ వృద్ధి నమోదు అవ్వొచ్చని ఆర్ధిక విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అంటే పదేళ్లలో ఇదే అధమం… దీనికి చాలా కారణాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దానికి తోడు, మోడీ నోట్ల రద్దుతో సగటు భారతీయుడు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. బ్యాంకు లో కూడా డబ్బులు ఉంచకుండా నగదు రూపంలో ఇంట్లోనే పెట్టుకోవడం ఎక్కువైంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారు అన్న భయం పెట్టుబడిని వెంటాడుతోంది.

GST విధానం లో చాలా లోపాలున్నాయి. చాలా క్లిష్టతరంగా ఉన్న రిటర్న్స్ పద్ధతులు, రిఫండ్ రావడానికి పడుతున్న సమయం వలన చాలా చిన్న తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి.

పరిశ్రమ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. 2004 తర్వాత 2019 లో కనీస స్థాయి పెట్టుబడులు జరిగాయి. వినియోగం తగ్గినప్పుడు పరిశ్రమలు కూడా పెట్టుబడులు తగ్గించడం సాధారణం. బ్యాంకుల్లో తిరిగిరాని బాకీలు విపరీతంగా (2017 నుంచి మూడో వంతు) పెరిగిపోయాయి.. ఇప్పటికీ 55% జనాభా ఆధారపడిన వ్యవసాయ పరిశ్రమ నానాటికీ భారంగా నడుస్తోంది…

ఇలాగే కొనసాగితే ఇండియా లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదు అవుతుందేమో అని ఆర్ధిక విశ్లేషకుల అంచనా. అంటే, వస్తువుల ధరలు తగ్గి, పరిశ్రమల ఆదాయాలు తగ్గి, ఉపాధి తగ్గి మరింత సంక్షోభం ముదురుతోంది..

మోడీ తక్షణ కర్తవ్యం

ఈ మధ్య పరిశ్రమలకు ప్రకటించిన ఆర్ధిక తాయిలాల విలువ దాదాపు 70 వేల కోట్లు. వినియోగమే మందగించినప్పుడు ఇలాంటి తాయిలాలు పనిచేయవు.

అన్నింటికన్నా ముందు ప్రభుత్వం చెయ్యాల్సింది నమ్మకాన్ని పెంపొందించడం. ప్రజలకు ఉన్న అపోహలు, భయాలు దూరం చెయ్యడం. సరైన సమాచారం వారి అందుబాటులోకి తేవడం.

వినియోగం పెరగడానికి చారలు తీసుకోవడం, ప్రజల మీద GST భారం తగ్గించడం, చిన్న పరిశ్రమలకు మరింత సరళంగా GST పద్ధతుల్ని మార్చడం.. 2008 లో ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుకుపోతే ఇండియా లో దాని ప్రభావం చాలా తక్కువ. మన దేశ అసంఘటిత రంగం వలన, అలానే కొనసాగించకపోయినా, కొంత ఉదాసీనత అవసరమే అని విశ్లేషకుల అంచనా.

ఈ మధ్యే RBI నుంచి దాదాపు రెండు లక్షల కోట్లు అయాచితంగా ప్రభుత్వానికి వచ్చింది. వాటిని పెట్టుబడులకు, జాతీయ స్థాయి రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కి కొత్త ప్రజెక్టులకు వినియోగిస్తే ఇదొక బూస్ట్ లా పనిచేస్తుంది.

అయినా జీడీపీ ఒకటే సరిపోతుందా?

1950 నుంచి ఇప్పటికి మన దేశ సగటు జీడీపీ పది రెట్లు పెరిగింది. జనాభా నాలుగు రెట్లు పెరిగింది. కానీ, అప్పుడు దాదాపు 50% పైనే జనాభా poverty line దిగువున ఉంటే, ఇప్పటికీ దాదాపు 20% ఉన్నారు.. అంటే పెరిగే ఉత్పత్తి, సంపద కొన్ని వర్గాల చేతిలోనే ఉంటోంది. కొన్ని వర్గాలు పాశ్చాత్య జీవన ఒరవడిని కలిగిఉంటే, కొన్ని వర్గాలు ఆఫ్రికా తరహా పేద జీవన ఒరవడిని కలిగివున్నాయి.

ఈ మధ్య అమర్త్య సేన్ లాంటి ప్రముఖులు మానవ అభివృద్ధి సూచీ – HDI (Human Development Index) అనే ఇంకో తరహా గణాంకాన్ని అభివృద్ధి చేసారు. దీని ప్రకారం ఒక దేశ వృద్ధి ఆ దేశ ప్రజల బతుకులు ఎంతమేరకు బాగుపడ్డాయో కొలుస్తారు.

GDP లో భారత దేశం ప్రపంచంలో,తొలి ఐదు స్థానాల్లో ఉంది. అదే HDI లో మాత్రం మన దేశం స్థానం 130. ఇదొక్కటి చాలు మన దేశం లో సంపద ఎలా కేంద్రీకృతం కాబడిందో, ఎలా ప్రభుత్వాలు మారినా పాలనా వ్యవస్థ మారకుండా ఉందో.  

దేశంలో 70% సంపద కేవలం 10% కుటుంబాల చేతిలో ఉంది. జీడీపీ పెరిగితే వీళ్ళ సంపద మరింత పెరుగుతుంది. మిగతా 90% బతుకులు బాగుపడేది చాలా కొంచెం. ఉత్పత్తి పెరిగినా, ఆదాయాలు పెరిగినా, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పెరిగినా సామాన్యుడి జీవన ప్రమాణాలు పెద్దగా పెరగడం లేదు. బహుశా పరిస్థితులు ఇలా కొనసాగితే ఒక విప్లవం వచ్చి వ్యవస్థ సంపూర్ణంగా మారితే ఏమైనా ప్రత్యామ్నాయ ఫలితాలు ఉంటాయేమో.