iDreamPost
android-app
ios-app

ఐపీఎల్ రెండవ సీజన్ విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్…

ఐపీఎల్  రెండవ సీజన్ విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్…

2009,మే 24న ఆదివారం జోహాన్స్ బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరును ఆరు పరుగుల తేడాతో ఓడించి దక్కన్ చార్జర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2009 ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ రెండవ ఎడిషన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక టైటిల్ పోరులో కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌సిబి టాస్ గెలిచి దక్కన్ చార్జర్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దక్కన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ అజేయంగా 53 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు.మిడిల్ ఆర్డర్‌లో ఆండ్రూ సైమండ్స్ 33 పరుగులతో ఒక మాదిరి ప్రదర్శన కనబరిచాడు.నిర్ణీత 20 ఓవర్‌లలో దక్కన్ చార్జర్స్ ఆరు వికెట్‌ల నష్టానికి 143 పరుగులు చేసింది.ఆర్‌సిబి బౌలింగ్‌ని ప్రారంభించిన కెప్టెన్,లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన నాలుగు ఓవర్‌లలో 16 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రన్ చేజ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ షాట్ సెలక్షన్ సరిగా లేకపోవడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.నాల్గవ ఓవర్‌లో జట్టు స్కోర్ 16 పరుగుల వద్ద రుద్ర సింగ్ బౌలింగ్‌లో ఓపెనర్ జాక్వెస్ కాలిస్ (15) బౌల్డ్ అయ్యాడు.గత రెండు మ్యాచ్‌లలో రాణించిన బెంగళూరు హీరో మనీష్ పాండే ఏడో ఓవర్‌లో ఓజా బంతికి వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.ఈ మ్యాచ్‌లో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 32 పరుగులతో బెంగళూరు తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. కాని తొమ్మిదవ ఓవర్‌లో ఓజా బంతిని అంచనా వేయడంలో విఫలమై గిల్‌క్రిస్ట్ చేసిన స్టంప్ ఔట్‌తో పెవిలియన్ బాట పట్టాడు. 9 పరుగులు చేసిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

తర్వాత సైమండ్స్ బౌలింగ్‌లో రాస్ టేలర్ (27), విరాట్ కోహ్లీ (7) పెవిలియన్‌ చేరారు.మార్క్ బౌచర్ కట్ షాట్‌తో కవర్లను క్లియర్ చేయడానికి ప్రయత్నించి హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో గిబ్స్ చేతికి చిక్కాడు. హారిస్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ అద్భుతంగా డ్రైవ్ చేసి పట్టిన క్యాచ్‌తో వినయ్ కుమార్ తొమ్మిదవ వికెట్‌గా వెనక్కి పంపడంతో దక్కన్ చార్జర్స్ శిబిరంలో వేడుకలకు నాంది పలికాడు. ఇక చివరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 137 పరుగులకు మాత్రమే పరిమితమైంది.ఆర్‌సిబిపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన దక్కన్ చార్జర్స్ ఐపీఎల్‌-2009లో గిల్ క్రిస్ట్ నాయకత్వంలో ఛాంపియన్ షిప్ గెలుపొందింది.

హైదరాబాది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా నాలుగు ఓవర్‌లలో కేవలం 28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి దక్కన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా తుది పోరులో ఆర్‌సిబి సారధి అనిల్ కుంబ్లే నాలుగు ఓవర్లలో 4/16 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ ‘గా ఎంపిక కావడం ఒక్కటే ఆ జట్టుకు ఊరటనిచ్చిన అంశం.